IND-PAK: భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే... చెలరేగిన విమర్శలు

IND-PAK: భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే... చెలరేగిన విమర్శలు
ఏ మ్యాచ్‌కు లేని ప్రత్యేకత ఆ మ్యాచ్‌కే ఎందుకని ప్రశ్నలు... శ్రీలంక, బంగ్లా మాజీల అసహనం...

ఆసియాకప్‌లో భారత్ -పాక్‌ మధ్య జరిగే సూపర్ -4 మ్యాచ్‌కు సెప్టెంబర్ 11ను రిజర్వ్ డే గా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. సెప్టెంబరు 10న కొలంబో వేదికగా భారత్, పాక్ తలపడనున్నాయి. సెప్టెంబరు 11 రిజర్వ్ డే గా ఉంటుంది. ఒకవేళ వర్షం కారణంగా ఆటను నిలిపివేస్తే మరుసటి రోజు అక్కడి నుంచే మ్యాచ్ తిరిగి ప్రారంభమవుతుందని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ స్పష్టం చేసింది. మ్యాచ్ టికెట్లు రిజర్వ్ డే రోజున కూడా చెల్లుబాటు అవుతాయని తెలిపింది. వర్షాల బెడద కారణంగా ఏసీసీ ఇప్పటికే ఫైనల్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డేను ప్రకటించింది. అయితే భారత్‌-పాక్‌ పోరుకు మాత్రమే రిజర్వ్‌డే కేటాయించడం పట్ల బంగ్లాదేశ్‌ కోచ్‌ సిల్వర్‌వుడ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. శనివారం శ్రీలంకతో బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కూ ఈ అవకాశం కల్పించాల్సిందని అన్నాడు.


ప్రేమదాస స్టేడియంలో మొత్తం ఐదు సూపర్‌ 4 మ్యాచ్‌లు ఉండగా... మిగతా నాలుగు మ్యాచ్‌లకు కాకుండా ఒక్క భారత్, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌కే ‘రిజర్వ్‌ డే’ ఇవ్వడం ఇప్పుడు వివాదం రేపుతోంది. లీగ్‌ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. పాకిస్తాన్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశమే రాలేదు. దాంతో టోర్నీ ఆర్థికపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రసారకర్తల విజ్ఞప్తి మేరకు ఏసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


ఆసియా కప్‌ ‘సూపర్‌–4’ దశలో మిగతా నాలుగు మ్యాచ్‌లను కాదని ఒక్క భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్‌కే రిజర్వ్‌ డే కేటాయించడం పట్ల అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఒక టోర్నమెంట్‌లో ఈ తరహా వివక్ష ఎక్కడా చూడలేదని, బరిలో ఉండే అన్ని టీమ్‌లు, మ్యాచ్‌లు సమానం అనే క్రీడాస్ఫూర్తిని మరచి ఇలాంటి ప్రత్యేక ఏర్పాటు ఏమిటని, మిగిలిన మ్యాచ్‌లలో ఏవైనా వర్షం కారణంగా రద్దయి ఆయా టీమ్‌లు ఒక్క పాయింట్‌కే పరిమితం అయితే వారికి అన్యాయం చేసినట్లే కదా అని శ్రీలంక, బంగ్లాదేశ్‌ మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు.

ఆసియా కప్‌ ‘సూపర్‌–4’లో భాగంగా నేడు జరిగే రెండో మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్‌ తలపడనున్నాయి. పాకిస్తాన్‌ చేతిలో తొలి మ్యాచ్‌లో చిత్తయిన బంగ్లాదేశ్‌ ఫైనల్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గడం తప్పనిసరి. చావోరేవో అయిన ఈ మ్యాచ్‌లో బంగ్లా ఎలా ఆడుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు లంకకు ఇది తొలి మ్యాచ్‌. సొంతగడ్డపై ఆడుతున్న ఆ జట్టు విజయంతో శుభారంభం చేయాలని ఆశిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.


Tags

Read MoreRead Less
Next Story