ASIA GAMES: శతపతక భారత్

ASIA GAMES: శతపతక భారత్
ఆసియా గేమ్స్‌లో వంద పతకాలు కైవసం... నెరవేరిన లక్ష్యం

శత పతకాల లక్ష్యం నెరవేరింది. ఆసియా గేమ్స్‌లో వంద పతకాలు సాధించాలన్న భారత సంకల్పం సిద్ధించింది. ఆటగాళ్ల అసాధారణ ప్రదర్శనతో భారత్‌ జట్టు గతంలో ఎన్నడు లేనని పతకాలను కైవసం చేసుకుని చైనా గడ్డపై విజయ గర్జన చేసింది. జ్యోతి సురేఖ మూడు స్వర్ణాలతో అదిరిపోయే ప్రదర్శన చేయగా... అవినాశ్ ముకుంద్‌ సాబలే, హర్మిలన్‌ రెండేసి పతకాలు సాధించి సత్తా చాటారు. హాకీ, కబడ్డీ జట్లు స్వర్ణ పతకాలతో భారత కీర్తిని నలుదిశలా వ్యాపించాయి. ఈ మైలురాయి వెనక అద్భుతాలు సృష్టించిన ఆటగాళ్లను ఓసారి చూస్తే.


ఈ ఆసియా కప్‌లో అసలైన స్టార్‌ అంటే తెలుగమ్మాయి జ్యోతి సురేఖనే. మూడు స్వర్ణ పతకాలు కైవసం చేసుకుని భారత్‌కు తిరుగులేని ఆధిక్యం అందించిందిఈ భారత స్టార్‌ ఆర్చర్. ఇవాళ మూడో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్ని భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. ఇప్పటికే ఆర్చరీ కాంపౌండ్‌ వుమెన్స్‌ టీమ్‌ విభాగం, ఆర్చరీ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ విభాగంలో స్వర్ణ పతకాలు దక్కించుకున్న జ్యోతి సురేఖ.. తాజాగా ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో 149-145తో విజయం సాధించి స్వర్ణాన్ని ముద్దాడింది. ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన సో చెవాన్‌పై జ్యోతిసురేఖ అద్భుత ఆటతీరుతో గెలుపొందింది. ప్రారంభంలో కాస్త తడబడ్డ ఈ భారత స్టార్‌ ఆర్చర్‌.. తర్వాత తన అనుభవాన్నంత ఉపయోగించి అద్భుతంగా పుంజుకుంది.


అంతకుముందు ఆర్చరీలో భారత్‌కు మరో కాంస్య పతకం కూడా దక్కింది. అదితి గోపీచంద్ స్వామి 146-140తో ఇండోనేషియాకు చెందిన రాతిహ్ జిలిజాటిని ఓడించి కాంస్య పతకాన్ని సాధించి ఆసియా గేమ్స్‌ చివరి రోజు భారత్‌కు ఘనమైన ప్రారంభాన్ని ఇచ్చింది. అదితి 17 ఏళ్ల వయసులోనే అద్భుత ప్రదర్శన చేసింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కూడా అదితి బంగారు పతకం సాధించింది. ఈ ఆసియా గేమ్స్‌లో అందరి అంచనాలను నిజం చేస్తూ. జావెలిన్‌ త్రోలో భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా 88.88 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి పసిడిని ముద్దాడాడు. ఇదే విభాగంలో నీరజ్‌కు గట్టిపోటీ ఇచ్చిన కిశోర్‌ కుమార్‌ జెనా.... కెరీర్‌ బెస్ట్‌ నమోదు చేస్తూ రజత పతకం కైవసం చేసుకున్నాడు. 86.77 మీటర్ల దూరం బల్లెం విసిరిన కిశోర్‌ చివరి వరకూ నీరజ్‌కు గట్టిపోటీనిచ్చాడు. వీరిద్దరూ ఒలింపిక్స్‌కు అర్హత సాధించి భారత్‌కు పతక ఆశలను రెట్టింపు చేశారు.

ఫోర్‌ ఇన్‌టు 400 మీటర్ల రీలేలో భారత పురుష అథ్లెట్లు స్వర్ణంతో సత్తా చాటగా.... ఇదే విభాగంలో మహిళా అథ్లెట్లు రజత పతకం సాధించారు. లాంగ్‌ డిస్టాన్స్‌ రన్నింగ్‌లో అవినాశ్ ముకుంద్‌ సాబలే రెండు పతకాలు సాధించి సత్తా చాటగా...మహిళల 1500, 800 మీటర్లలోనూ రజతం గెలుచుకుని హర్మిలన్‌ చరిత్ర సృష్టించింది.

Tags

Read MoreRead Less
Next Story