India A -Pakistan A: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

India A -Pakistan A: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం
ఈ విజయంతో గ్రూప్-బీ నుంచి అగ్రస్థానంలో నిలిచింది. సెమీ ఫైనల్లో భారత్, గ్రూప్‌-ఏ టీం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. పాకిస్థాన్-ఏ జట్టు శ్రీలంకతో తలపడనుంది.

భారత క్రికెట్ యువ ఆటగాడు యశ్‌ధూల్ సారథ్యంలోని భారత్‌-ఏ(India-A) జట్టు పాకిస్థాన్-ఏ(Pakistan-A) జట్టుపై ఘన విజయం సాధించింది. ACC పురుషుల ఎమర్జింగ్ ఆసియాలో కప్‌(ACC Men's Emerging Asia Cup)లో భాగంగా దాయాదులు తలపడ్డాయి. భారత బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్(104 నాటౌట్, 10x4, 3x6) అజేయమైన సెంచరీ చేయడంతో పాకిస్థాన్ ఇచ్చిన 208 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.4 ఓవర్లలోనే అలవోకగా ఛేదించింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరో బ్యాట్స్‌మెన్ నికిన్ జోస్ 53 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్‌కి 99 పరుగులు జోడించారు. 157 పరుగుల వద్ద జోస్ ఔటైనా, కెప్టెన్‌ యశ్‌ధూల్‌(Yash Dhul)తో కలిసి పని పూర్తిచేశారు. సాయి సుదర్శన్ 98 పరుగుల వద్ద ఉన్నపుడు భారత్‌ విజయానికి 2 పరుగులు మాత్రమే అవసరం కాగా సిక్స్‌ కొట్టి అటు సెంచరీని పూర్తి చేసుకుని, భారత్‌కు విజయాన్ని ఖాయం చేశాడు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు, భారత బౌలర్ రాజవర్ధన్ హంగర్గేకర్ ధాటికి 207 పరుగులకే ఆలౌటయింది. 5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయింది. 4వ ఓవర్లో మొయిడెన్‌ ఓవర్‌తో పాటు రెండు వికెట్లు తీసిన రాజవర్ధన్, చివర్లో టెయిలండర్ల పనిపట్టాడు. మరో స్పిన్నర్ మానవ్ సుథార్ కూడా 3 కీలక వికెట్లు తీశాడు. పాకిస్థాన్‌ బ్యాట్స్‌మెన్లలో ఖాసీం అక్రం ఒక్కడే 48 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఖాసీం హంగర్గేకర్ బౌలింగ్‌లో, హర్షద్ రానా పట్టిన అద్భతమైన క్యాచ్‌కి వెనుదిరిగాడు.

ఈ విజయంతో గ్రూప్-బీ నుంచి అగ్రస్థానంలో నిలిచింది. సెమీ ఫైనల్లో భారత్, గ్రూప్‌-ఏ టీం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. పాకిస్థాన్-ఏ జట్టు శ్రీలంకతో తలపడనుంది.


Tags

Read MoreRead Less
Next Story