ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌కు సిద్ధమవుతున్న టీమిండియా.. మిడిలార్డర్‌లో మార్పులు..!

ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌కు సిద్ధమవుతున్న టీమిండియా.. మిడిలార్డర్‌లో మార్పులు..!
సరైన ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకపోవడంతో న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఘోర పరాజయం పాలైంది.

ఎన్నో ఆశలతో ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీ సేనకు ఆదిలోనే పరాజయం ఎదురైంది. సరైన ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకపోవడంతో న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఘోర పరాజయం పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ విఫలమైన కోహ్లి గ్యాంగ్ టైటిల్ ను చేజార్చుకుంది. ఈ ఓటమిని విశ్లేషిస్తే… చాలా కారణాలు బయటపడతాయి. త్వరలో భారత్ ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరగనుంది. ఆగస్ట్ 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు...మొత్తం 5 టెస్టుల సిరీస్ జరగనుంది. WTC ఫైనల్లో ఓడిన టీమిండియా.. ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​లో సత్తాచాటాలని భావిస్తోంది. అందుకోసం జట్టులో కొన్ని మార్పులు చేయాలని చూస్తోంది. భారత స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ను మరోసారి జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గిల్ రాకతో టెస్టుల్లో రాహుల్ చోటు కష్టమైంది. అయితే ఇంగ్లండ్ పై వరుసగా విఫలమవుతున్న గిల్ ను పక్కన పెట్టాలని మేనేజ్​మెంట్ భావిస్తోంది.

స్వదేశంలో ఇంగ్లాండ్​తో జరిగిన నాలుగు టెస్టుల్లో కేవలం ఒకే ఒక అర్ధ సెంచరీ చేశాడు గిల్. టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్లోనూ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్​లో 64 బంతుల్లో 24 పరుగులతో కాసేపు క్రీజులో నిలిచినా.. రెండో ఇన్నింగ్స్​లో 8 పరుగులకే పెవిలియన్ చేరి నిరాశపర్చాడు. దీంతో ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ ముందు ఫామ్​తో సతమతమవుతోన్న గిల్​ను పక్కనపెట్టే అవకాశం ఉంది. గత ఇంగ్లాండ్ పర్యటనలో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న రాహుల్​ను గిల్​ను ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. ఇతడు ఓవల్​ వేదికగా జరిగిన చివరి ఇన్నింగ్స్​లో 149 పరుగులతో సత్తాచాటాడు. దీంతో రోహిత్​తో పాటు రాహుల్​ ఓపెనర్​గా కనిపించే అవకాశం ఉంది.

విదేశాల్లో టీమ్ఇండియా బ్యాటింగ్ విభాగం దారుణంగా విఫలమవుతోంది. ముఖ్యంగా మిడిలార్డర్​లో జట్టును ఆదుకునే ఇన్నింగ్స్ కనిపించడం లేదు. ఛాంపియన్​షిప్ ఫైనల్లోనూ ఇదే తీరు కనిపించింది. దీంతో ఈ విభాగంలో పలు మార్పులు చేయాలని చూస్తోంది కోహ్లీసేన. ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్ రౌండర్ జడేజా స్థానం గల్లంతయ్యే అకాశం కనిపిస్తుంది. జడేజా మంచి ఆటగాడే అయినా ఇంగ్లండ్ ఫాస్ట్ పిచ్ లపై తేలిపోతున్నాడు దీంతో.. జడేజా స్థానంలో హనుమ విహారికి అవకాశం ఇవ్వాలని భావిస్తునట్లు సమాచారం. తన టెక్నిక్​తో దిగ్గజాల ప్రశంసలు పొందిన విహారి ఈ స్థానానికి తగిన వాడిననని చాలాసార్లు నిరూపించాడు. దీంతో జడేజా స్థానంలో విహారిని జట్టులోకి తీసుకునే విషయమే పరిశీలిస్తోంది.

టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా స్వింగ్ బౌలర్ ను మిస్ అయ్యింది. భువనేశ్వర్ కుమార్ శ్రీలంక టూర్ కోసం పయనమవగా.. సిరాజ్, శార్దూల్ లో ఒకరిని ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కోసం బరిలో దించే అవకాశం ఉంది. ఇక వంద టెస్టులు ఆడిన అనుభవం ఉన్న ఇషాంత్​.. కివీస్​తో మ్యాచ్​లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. గాయంతోనే ఫైనల్లో ఆడిన ఇతడిని ఇంగ్లాండ్​ సిరీస్​కు పక్కనపెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆస్టేలియాలో మంచి ప్రదర్శన చేసిన సిరాజ్ కు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ కోహ్లీసేన ఆల్​రౌండర్​తో బరిలో దిగాలనుకుంటే శార్దూల్​ ఠాకూర్​ను బరిలో దించే అవకాశం ఉంటుంది. ఇంగ్లాండ్ పరిస్థితులకు తగ్గట్లు పేస్ బౌలింగ్​తో పాటు కీలక సమయంలో బ్యాట్​తోనూ ఇతడు రాణించగలడు. అందువల్ల ఇషాంత్ స్థానంలో సిరాజ్, శార్దూల్​కు ఇద్దరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఇంగ్లండ్ పర్యటనలో ఆరంభంలోనే ఎదురు దెబ్బతిన్న టీమిండియా.. టెస్ట్ సిరీస్ లో ఆచితూచి అడుగేయాలని భావిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story