INDIA_PAK: పాక్‌ దిమ్మతిరిగింది

INDIA_PAK: పాక్‌ దిమ్మతిరిగింది
ఆసియాకప్ సూపర్‌ ఫోర్‌లో భారత్‌ ఘన విజయం.... మెరిసిన కోహ్లీ, రాహుల్‌, కుల్‌దీప్‌....

ఆసియాకప్‌ సూపర్‌ 4లో దాయాదితో జరిగిన హై ఓల్టేజ్‌ మ్యాచ్‌లో టీమిండియా చెలరేగింది. ఓపెనర్లు అర్ధ శతకాలతో అదరగొట్టగా... తర్వాతి బ్యాటర్లు సెంచరీలతో పాక్‌ బౌలర్లను బెదరగొట్టగా... దాయాది దేశం ఘోరంగా చిత్తయింది. ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన రోహిత్‌ సేన... పాకిస్థాన్‌ను 228 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మొదట కోహ్లీ, కె.ఎల్‌. రాహుల్‌ సెంచరీలతో కదం తొక్కగా.. తర్వాతి పనిని బౌలర్లు పూర్తి చేశారు. ప్రపంచకప్‌ ముంగిట భారత ప్రదర్శన క్రికెట్‌ ప్రేమికుల అంచనాలను అమాంతం పెంచేసింది.


ఆసియా కప్‌ సూపర్‌-4 లో భారత్‌ ధాటికి పాక్‌ కుదేలైపోయింది. వర్షం వల్ల రెండు రోజుల పాటు సాగిన మ్యాచ్‌లో భారత్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు అర్ధశతకాలు సాధిస్తే.. తర్వాత వచ్చిన ఇద్దరూ శతక మోత మోగించారు. తర్వాత బౌలింగ్‌లోనూ భారత్‌ జోరుకు ప్రత్యర్థి నిలవలేకపోయింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఒక్కరూ 30 దాటలేదు. కొలంబోలో టీమ్‌ఇండియాకు పాక్‌ నుంచి కనీస పోటీ లేదు. చిరకాల ప్రత్యర్థిని చిత్తుగా ఓడించించింది.

ఆదివారం టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి 147/2తో నిలవగా.. రిజర్వ్‌ డే అయిన సోమవారం ఇన్నింగ్స్‌ను కొనసాగించి మరో వికెట్‌ కోల్పోకుండా 356 పరుగుల భారీ స్కోరు సాధించింది. అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన విరాట్‌ కోహ్లి (122 నాటౌట్‌; 94 బంతుల్లో 9×4, 3×6), కేఎల్‌ రాహుల్‌ (111 నాటౌట్‌; 106 బంతుల్లో 12×4, 2×6) శతకాలతో అజేయంగా నిలిచారు.


స్పిన్నర్‌ షాదాబ్‌ను సైతం రాహుల్‌ అలవోకగా ఎదుర్కోగా.. కోహ్లి తనదైన శైలిలో బౌండరీలు కొడుతూ ముందుకు సాగాడు. రాహుల్‌ 60 బంతుల్లో, కోహ్లి 55 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. 50 తర్వాత కోహ్లి చెలరేగిపోయాడు. విరాట్‌ సైతం తనను లక్ష్యంగా చేసుకోవడంతో ఇఫ్తికార్‌ 5 ఓవర్లలోనే 46 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి ఓవర్లలో విరాట్‌, రాహుల్‌ విధ్వంసం సృష్టించారు. రాహుల్‌ సరిగ్గా వంద బంతుల్లో సెంచరీ చేయగా.. కోహ్లి 84 బంతుల్లోనే ఈ మార్కును అందుకున్నాడు. వీరిద్దరి విధ్వంసంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది.

357 పరుగుల భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన పాక్‌ బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (5/25) ధాటికి విలవిలలాడిన పాక్‌ 32 ఓవర్లలో కేవలం 128 పరుగులకే పరిమితమైంది. గాయాల కారణంగా హారిస్‌ రవూఫ్‌, నసీమ్‌ షా బ్యాటింగ్‌కు రాకపోవడంతో 8 వికెట్లకే ఆ జట్టు ఇన్నింగ్స్‌ ముగించింది. 27 పరుగులు చేసిన జమానే ఆ జట్టులో టాప్‌స్కోరర్‌. బుమ్రా బంతి బంతికీ పరీక్ష పెట్టడంతో పరుగులు చేయడం సంగతటుంచితే వికెట్‌ కాపాడుకోవడం పాక్‌ ఓపెనర్లకు కష్టమైపోయింది. బంతి ఎక్కడ పడుతుందో, ఎటు తిరుగుతుందో తెలియనట్లుగా సాగిన కుల్‌దీప్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం పాక్‌ బ్యాటర్లకు శక్తికి మించిన పనే అయింది. వరుసగా 8 ఓవర్లు బౌలింగ్‌ చేసిన కుల్‌దీప్‌.. మరో బౌలర్‌కు అవకాశమివ్వకుండా చివరి 5 వికెట్లనూ తన ఖాతాలోనే వేసుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story