Badminton: కెనడా ఓపెన్ భారత ఆటగాడు లక్ష్యసేన్‌ వశం

Badminton: కెనడా ఓపెన్ భారత ఆటగాడు లక్ష్యసేన్‌ వశం

భారత బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్యసేన్ సంచలనం సృష్టించాడు. 21 యేళ్ల లక్ష్యసేన్ కెనడా ఓపెన్‌-2023 పురుషుల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఉత్కంఠగా సాగిన ఫైనల్‌లో 19వ ర్యాంక్ ఆటగాడైన లక్ష్యసేన్, ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ అయిన చైనా ఆటగాడు, వరల్డ్ నంబర్ 10 ర్యాంకర్ ఫెంగ్‌ను 21-18, 22-20 పాయింట్ల తేడాతో ఓడించి కప్ గెలిచాడు.

మ్యాచ్ ఆరంభం నుంచీ ఇద్దరు క్రీడాకారులు హోరా హోరీగా తలపడ్డారు. తమ జంప్‌లతో గంటకు 390కిమీ, 400కిమీల వేగంతో కూడిన బలమైన షాట్లు, ర్యాలీలతో ప్రతీ సర్వ్‌ని ఉత్కంఠగా మలిచారు. తొలి సెట్‌లో 12-15తో వెనకబడ్డ ఫెంగ్ పుంజుకుని 15-15కి చేరుకున్నాడు. సేన్ తన హార్డ్ స్మాష్‌లతో వరుస పాయింట్లతో సెట్‌ని గెలిచాడు. రెండవ సెట్‌లో ఇద్దరు ఆటగాళ్లు తమ ఫోర్ హ్యాండ్ షాట్లతో కోర్టంతా తిరుగుతూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. చివరికి లక్ష్యసేన్ 22-20 పాయింట్లతో మ్యాచ్‌తో పాటు టైటిల్ సొంతం చేసుకున్నాడు. కోర్టులో సంబరాల్లో మునిగితేలాడు.


ఫైనల్‌కి చేరడానికి లక్ష్యసేన్ రౌండ్-32లో థాయ్ ప్లేయర్ వితిద్‌సర్న్‌ను 21-18, 21-15 తేడాతో, రౌండ్‌-16లో బ్రెజిల్ ప్లేయర్ ఒలివేరాను 21-15, 21-11తో, క్వార్టర్స్‌లో జర్మనీ ప్లేయర్ కారాగిని 21-8, 17-21, 21-10తో, సెమీ ఫైనల్లో జపాన్ కెంటా నిషిమోటోను 21-17, 21-14 తేడాతో ఓడించాడు.

కామన్‌వెల్త్‌ క్రీడల్లో బంగారు పతకం సాధించిన లక్ష్యసేన్ ఇంతకు ముందు ఇండియన్‌ ఓపెన్‌-2022ని గెలిచాడు. ఇప్పుడు రెండవ BWF వరల్డ్ టూర్ టైటిల్ సాధించాడు.

ఇక భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సెమీ ఫైనల్‌లో జపాన్‌ క్రీడాకారిణి చేతిలో 12-21, 15-21 తేడాతో ఓడి ఇంటి ముఖం పట్టిన సంగతి తెలిసిందే.


Tags

Read MoreRead Less
Next Story