CWC 2023: ప్రోటీస్‌ హిట్టు.. ఇంగ్లాండ్‌ చిత్తు..

CWC 2023: ప్రోటీస్‌ హిట్టు.. ఇంగ్లాండ్‌ చిత్తు..
దక్షిణాఫ్రికా చేతిలో ఇంగ్లాండ్‌ ఘోర పరాజయం... 229 పరుగుల తేడాతో సఫారీ జట్టు ఘన విజయం...

ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయాన్ని నమోదు చేసింది. పూర్తి ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ప్రొటీస్‌ విధించిన 400 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్‌ 22 ఓవర్లలో కేవలం 170 పరుగులకే కుప్పకూలింది. దీంతో 229 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ప్రొటీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. అనంతరం 400 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిటీష్‌ జట్టు కేవలం 22 ఓవర్లలో 170 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌.. దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వచ్చి రాగానే ఓపెనర్‌ క్వింటన్ డికాక్‌.. తోప్లే వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే ఫోర్‌ కొట్టాడు. కానీ తర్వాతి బంతికే కీపర్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కానీ ఈ ఆనందం ఇంగ్లాండ్‌కు ఎక్కువసేపు నిలువలేదు.


రెండో వికెట్‌కు హెన్రిక్స్‌-వాన్‌డేర్‌ డస్సెన్‌ జోడి 121 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. 61 బంతుల్లో 60 పరుగులు చేసిన వాన్‌డేర్‌ డస్సెన్‌ను రషీద్‌ అవుట్‌ చేశాడు. 85 పరుగులు చేసి సెంచరీ దిశగా సాగుతున్న రీజా హెన్డ్రిక్స్‌ను రషీద్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత క్లాసెన్‌, జాన్సన్‌ మెరుపు బ్యాటింగ్‌తో ప్రొటీస్‌ స్కోరు బోర్డును పరుగు పెట్టించారు. 67 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్‌ 12 ఫోర్లు, 4 సిక్సులతో 109 పరుగులు చేసి అవుటయ్యాడు. జాన్సన్ 42 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. క్లాసెన్‌కు తోడు జాన్సన్‌ కూడా చివరి పది ఓవర్లలో విధ్వంసం సృష్టించాడు. క్లాసెన్‌ అద్భుత శతకానికి తోడు హెన్డ్రిక్స్‌ 85 పరుగులు, వాన్‌డెర్‌ డస్సెన్‌ 60, మార్‌క్రమ్‌ 42, రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి దక్షిణాఫ్రికా 399 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో తోప్లే 3, అదిల్ రషీద్‌ రెండు వికెట్లు తీశారు.

దక్షిణాఫ్రికా నిర్దేశించిన 400 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ప్రొటీస్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద బెయిర్‌ స్టో అవుటవ్వడంతో బ్రిటీష్‌ జట్ల వికెట్ల పతనం ప్రారంభమైంది. రూట్‌ రెండు పరుగులకే వెనుదిరగగా... ఎన్నో ఆశలు పెట్టుకున్న బెన్‌ స్టోక్స్‌ అయిదు పరుగులు చేసి రబాడ బౌలింగ్‌ అవుటవ్వడంతో 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్‌ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. బ్రూక్‌, బట్లర్‌ను వెంటవెంటనే అవుట్‌ చేసిన కోట్జే బ్రిటీష్‌జట్టును చావు దెబ్బ కొట్టాడు. 68 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ జట్టు వందలోపే ఆలౌటయ్యేలా కనిపించింది. కానీ బ్రిటీష్‌ జట్టను టెయిలెండర్లు ఆదుకున్నారు. అటిక్సన్‌ 35, మార్క్‌ వుడ్‌ 43 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో ఇంగ్లాండ్‌ 150 పరుగులైనా దాటింది.

Tags

Read MoreRead Less
Next Story