CWC 2023: ప్రపంచకప్‌లో ప్రకంపన

CWC 2023: ప్రపంచకప్‌లో ప్రకంపన
నెదర్లాండ్స్‌ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు

ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదైంది. వరుస విజయాలతో ఊపు మీదున్న దక్షిణాఫ్రికాపై పసికూన నెదర్లాండ్స్‌ ఘన విజయం సాధించింది. రెండు విజయాలతో ప్రపంచకప్‌ ఫేవరెట్లలో ఒకటిగా మారిపోయిన ప్రొటీస్‌ను వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయిన నెదర్లాండ్స్‌ మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్‌లో అంచనాలకు మించి రాణించిన డచ్‌ జట్టు... బాల్‌తో అద్భుతం చేసింది. వర్షం వల్ల 43 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. అనంతరం 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 207 పరుగులకే కుప్పకూలింది. దీంతో 38 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసి ఈ ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదు చేసింది. సమష్టిగా రాణించిన నెదర్లాండ్స్ బౌలర్లు ప్రొటీస్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.


టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా నెదర్లాండ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అరంభంలో ప్రొటీస్‌ బౌలర్లు సమష్టిగా రాణించారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి నెదర్లాండ్స్‌పై ఒత్తిడి పెంచారు. ప్రారంభం నుంచి నెదర్లాండ్స్‌ను కట్టడి చేసిన సఫారీ బౌలర్లు చివర్లో ధారళంగా పరుగులు ఇచ్చారు. దీంతో 200 పరుగుల మార్క్‌ అయినా దాటుందన్న అన్న దశ నుంచి కోలుకొని నెదర్లాండ్స్ 245 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. నెదర్లాండ్స్‌ సారధి స్కాట్ ఎడ్వర్డ్స్ ఒంటరి పోరాటంతో జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. చివరి వరకూ అజేయంగా ఉన్న ఎడ్వర్డ్స్‌ 69 బంతుల్లో 78 పరుగులు చేశాడు. ఎడ్వర్డ్స్‌ తప్ప మరే నెదర్లాండ్స్‌ బ్యాటర్‌ కనీసం 30 పరుగుల మార్కును దాటలేకపోయాడు. చివర్లో ఆర్యన్‌ దత్త్ మెరుపులు మెరిపించాడు. కేవలం తొమ్మిది బంతుల్లోనే మూడు సిక్సర్లు బాదిన ఆర్యన్‌.... 23 పరుగులు చేశాడు.


246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆరంభంలో ఆచితూచి ఆడింది. కానీ 36 పరుగుల వద్ద భీకర ఫామ్‌లో ఉన్న డికాక్‌ను అవుట్‌ చేసి వాన్ డెర్‌ మెర్వే సఫారీ పతనాన్ని ప్రారంభించాడు. అనంతరం దక్షిణాఫ్రికా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. జట్టు 44 పరుగులకు చేరేలోపే నాలుగు వికెట్లు పడ్డాయి. అనంతరం క్లాసన్‌, మిల్లర్‌ సఫారీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ క్లాసన్‌ అవుట్‌ కావడంతో మళ్లీ వికెట్ల పతనం ప్రారంభమైంది. కాట్జే, మిల్లర్‌, మహరాజ్‌ కూడా పెవిలియన్‌ చేరడంతో దక్షిణాఫ్రికా విజయం ఖాయమైంది. మిల్లర్‌ ఒక్కడే 43 పరుగులతో రాణించాడు. మిగిలిన ఏ దక్షిణాఫ్రికా బ్యాటర్‌ 30 పరుగులు కూడా చేయలేకపోయాడు. దీంతో 207 పరుగులకే సఫారీ జట్టు కుప్పకూలి... 38 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

Tags

Read MoreRead Less
Next Story