FIFA WWC 2023: న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా శుభారంభం

FIFA WWC 2023: న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా శుభారంభం

ఫిఫా మహిళల వరల్డ్‌కప్‌(FIFA WWC 2023) తొలి మ్యాచ్‌ల్లో ఆరంభ పోరులో ఆతిథ్య జట్లు ఆస్ర్టేలియా, న్యూజిలాండ్‌(New Zealand) శుభారంభం చేశాయి. ఆక్లాండ్‌లో జరిగిన గ్రూప్‌ ఎ మ్యాచ్‌లో కివీస్‌ జట్టు నార్వేను ఓడించి ఫిఫా చరిత్రలోనే తొలి విజయం సాధించింది. 48వ నిమిషంలో హన్నా విల్కిన్‌సన్‌ చేసిన గోల్‌తో ఈ మ్యాచ్‌ను చూసేందుకు రికార్డుస్థాయిలో హాజరైన 42 వేల మంది సంబరాలు అంబరాన్నంటాయి. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో నార్వేపై కివీస్‌ 1-0(1-0 win)తో విజయం సాధించింది.


సిడ్నీలో జరిగిన మరో మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఆస్ట్రేలియా( Australia) 1-0తో నెగ్గింది. 52వ నిమిషంలో స్టెఫానీ కాట్లీ ఏకైక గోల్‌ సాధించింది. అలాగే ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు ఏకంగా 75 వేల మంది హాజరయ్యారు. ఆసీస్‌లో మహిళా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ కోసం ఇంతమంది రావడం ఇదే తొలిసారి. ఈసారి ప్రపంచకప్‌‍(Women’s World Cup‌)లో మొత్తం 32 జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు న్యూజిలాండ్ ఒక్కసారి కూడా మహిళల ప్రపంచకప్‌ను గెలవలేదు. ఈ ఏడాది కూడా ఆడిన 9 మ్యాచ్‌ల్లో 7 ఓటమి చవిచూసింది. చరిత్రలో మొదటిసారి రెండు దేశాలు ఆతిథ్యమిస్తున్న ఈ వరల్డ్‌కప్‌ ఆరంభ వేడుకలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. పది నిమిషాలపాటు సాగిన ఈ వేడుకల్లో ఆసీ్‌స-కివీస్‌ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ కళాకారుల ప్రదర్శనలు సాగాయి. ఆక్లాండ్‌లో జరిగిన కాల్పుల మృతులకు సంతాపంగా వేడుకల ఆరంభానికి ముందు నివాళి ప్రకటించారు.


మొదటిసారిగా ఫిఫా మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2023ని న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు రెండూ సంయుక్తంగా మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాయి. టోర్నమెంట్ చరిత్రలో ఇది 9వ ఎడిషన్. తొలిసారిగా రెండు దేశాలు కలిసి నిర్వహిస్తున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు మహిళల ఫుట్‌బాల్ ప్రపంచాన్ని పూర్తి నెలపాటు నిర్వహించనున్నాయి. మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా 32 జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. ఈ జట్లు ఒక్కొక్కటి 4 చొప్పున 8 గ్రూపులుగా విభజించారు. ఇందులో ప్రతి గ్రూప్‌లోని టాప్-2 జట్లు రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ నుంచి నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2023లో 9 స్టేడియంలలో మొత్తం 64 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో మ్యాచ్‌లు ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్‌లతో పాటు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్, వెల్లింగ్టన్, డునెడిన్, హామిల్టన్‌లలో జరుగుతాయి.

ఈసారి మహిళల ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న జట్టుకు గతసారి కంటే 3 రెట్లు ఎక్కువ ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈసారి ప్రపంచకప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు దాదాపు రూ.86 కోట్లు అందుతాయి. అదే సమయంలో, 2019 సంవత్సరంలో, టోర్నమెంట్ మొత్తం ప్రైజ్ మనీ 30 మిలియన్‌ డాలర్లు ఉండగా.. ఇది ఈసారి 110 మిలియన్ల డాలర్లకు పెరిగింది.

Tags

Read MoreRead Less
Next Story