BWF rankings: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో ప్రణయ్‌

BWF rankings: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో ప్రణయ్‌
వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన స్టార్‌ షట్లర్‌... టాప్‌ టెన్‌లో ప్రణయ్‌ ఒక్కడే.... 14వ ర్యాంకులో పీవీ సింధు...

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌(World Badminton Championship)లో కాంస్య పతకం సాధించి( bronze medal) సంచలనం సృష్టించిన భారత షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (HS Prannoy) బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో కొంతకాలంగా విశేషంగా రాణిస్తున్న అత‌ను BWF విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ ప్రదర్శనతో అతడు కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. 72437 పాయింట్లు సాధించిన అతను.. మూడు స్థానాలు ఎగబాకి, ఆరో ప్లేస్‌కు చేరుకున్నాడు. ప్రణయ్‌ గతేడాది డిసెంబర్‌ నుంచి టాప్‌-10లో కొనసాగుతున్న ఏకైక భారత షట్లర్‌గా ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో ప్రణయ్‌ తర్వాత లక్ష్యసేన్‌ (12) భారత్‌ తరఫున అత్యుత్తమ ర్యాంకింగ్‌ దక్కించుకున్నాడు. ఇతని తర్వాత కిదాంబి శ్రీకాంత్‌ 20వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.


ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌ (World Badminton Championship) క్వార్టర్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ విక్టర్‌ అక్సెల్సెన్‌ (డెన్మార్క్‌)పై సంచలన విజయం సాధించి సెమీస్‌ చేరిన ప్రణయ్‌.. కున్లావత్‌ వితిద్సన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం పాలై కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. ప్రణయ్‌ సూపర్‌-500 మలేసియా మాస్టర్స్‌ టైటిల్‌ను, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు.


ఇతర భారత షట్లర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. లక్ష్య సేన్(Lakshya Sen) ఒక స్థానం దిగజారి 12వ స్థానంలో నిలిచాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మొదటి రౌండ్‌లోనే నిష్ర్కమించిన కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) 20వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు(PV Sindhu) ఒక స్థానం ఎగబాకి 14వ ర్యాంక్‌లో(Sindhu jumps to No 14) నిలిచింది. రెండుసార్లు ఒలింపిక్స్‌ పతకాలు సాధించిన సింధు ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్‌ షిప్స్‌లో ఒక్క విజయమైనా సాధించకుండానే ఇంటిముఖం పట్టింది. తొలి రౌండ్లో బై లభించడంతో నేరుగా రెండో రౌండ్‌ ఆడే అవకాశం దక్కించుకున్న సింధు.. జపాన్‌కు చెందిన నొజోమి ఒకుహరతో జరిగిన మ్యాచ్‌లో పరాజయంపాలైంది.

పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌- చిరాగ్‌ ద్వయం( Satwiksairaj Rankireddy and Chirag Shetty) ప్రపంచ రెండో ర్యాంకు నిలబెట్టుకోగా.. మహిళల డబుల్స్‌ గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ( Treesa Jolly and Gayatri Gopichand) జోడీ రెండు స్థానాలు మెరుగై 17వ ర్యాంక్‌ దక్కించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story