World Cup 2023: వన్డే ప్రపంచ కప్‌ విజేతకు రూ. 33 కోట్లు

World Cup 2023: వన్డే ప్రపంచ కప్‌ విజేతకు రూ. 33 కోట్లు
ప్రైజ్ మనీ వివరాలు రిలీజ్‌ చేసిన ఐసీసీ

World Cup 2023: పోరుకు మరికొద్ది రోజులే మిగిలుంది.ఇందు కోసం క్రికెట్‌ అభిమానులతో పాటు యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.ఈ నేపథ్యంలో ఐసీసీ భారీ మొత్తాన్ని ప్రైజ్‌మనీగా ప్రకటించింది. ప్రపంచ కప్‌ విజేత జట్టుకు 40 లక్షల యూఎస్‌ డాలర్లు అంటే సుమారు 33 కోట్ల 17 లక్షల రూపాయలు ఇవ్వనుంది.రన్నరప్‌ జట్టుకు 20 లక్షల యూఎస్‌ డాలర్లు అంటే సుమారు 16 కోట్ల రూపాయలు అందించనుంది. మొత్తం 48 మ్యాచ్‌లకు ప్రైజ్ మనీ, ప్రోత్సాహకాలను ఐసీసీ ప్రకటించింది.

సెమీ ఫైనల్స్‌లో ఓడిన జట్లు చెరో 6 కోట్ల రూపాయలను అందుకోనున్నాయి. నాకౌట్‌ మ్యాచ్‌లకు అర్హత సాధించడంలో విఫలమైన మిగిలిన ఆరు జట్లకు తలో 82 లక్షల రూపాయల ప్రైజ్‌మనీ దక్కనుంది. గ్రూప్ స్టేజ్‌లో జరిగే ప్రతి మ్యాచ్‌ విజేతకు సుమారు 33 లక్షల రూపాయల ప్రోత్సాహకం లభిస్తుంది. ఇలా టోర్నీ మొత్తానికి దాదాపు 83 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ప్రైజ్‌మనీ రూపంలో ఐసీసీ ఖర్చు చేయనుంది.


టోర్నీలో మరింత పోటీతత్వం నింపడంతో పాటు, ఆటగాళ్లకు అభిమానులకు వినోదభరితంగా మార్చే ప్రయత్నంలో భాగంగా...ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐసీసీ తెలిపింది. ప్రపంచ కప్ మ్యాచ్‌లు అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్‌లో జరగనున్నాయి. టోర్నీలో 45 లీగ్ మ్యాచ్‌లు, మూడు నాకౌట్ మ్యాచ్‌లు ఉంటాయి. ఈ టోర్నీలో భారత్‌, అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు పాల్గొననున్నాయి. నవంబర్‌ 19న ఫైనల్‌ మ్యాచ్‌తో టోర్నీ ముగియనుంది.

Tags

Read MoreRead Less
Next Story