Ranchi Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్

Ranchi Test:  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్
టీమిండియా తరపున అరంగేట్రం చేసిన మరో ఆటగాడు

రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇక భారత తుది జట్టులో ఒక మార్పు జరిగింది. పేసర్ ఆకాశ్ దీప్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా క్యాప్‌ను ఆకాశ్ దీప్‌కు అందజేశారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో అతడి స్థానంలో ఆకాశ్‌ను జట్టులోకి తీసుకున్నారు. టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ చేసేవాళ్లమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. పిచ్‌పై కొంచెం పొడిగా ఉండడంతో పాటు పగుళ్లు కనిపిస్తున్నాయని అన్నాడు. చివరి రెండు మ్యాచ్‌ల్లో బాగానే రాణించామని, ఈ మ్యాచ్‌లోనూ అదే ప్రదర్శన చేయాలనుకుంటున్నామని అన్నాడు.

రెండు మ్యాచుల్లోనూ విఫలమైన రజత్‌ పాటిదార్‌పై భారత మేనేజ్‌మెంట్‌ నమ్మకం ఉంచింది. పాటిదార్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు రోహిత్‌ శర్మ ప్రకటించాడు. వర్క్‌లోడ్‌తో పాటు భవిష్యత్ మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని స్టార్ బౌలర్ బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో...ఈ మ్యాచ్‌లో అతడి స్థానంలో ఆకాశ్‌దీప్‌కు స్థానం దక్కింది. బుమ్రా స్థానంలో ఆకాశ్‌దీప్‌ జట్టులోకి వచ్చాడు. వన్‌ డౌన్‌లో గిల్‌, తర్వాత రజత్ పటిదార్ బ్యాటింగ్‌కు రానున్నాడు. సీనియర్ ఆల్‌రౌండర్‌ జడేజా, అరంగేంట్ర టెస్టులోనే అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ మళ్లీ రాణించాలని జట్టు భావిస్తోంది. బుమ్రా గైర్హాజరీలో జడేజా, అశ్విన్‌, కుల్దీప్‌, ఆకాశ్‌దీప్‌లతో కూడిన బౌలింగ్ విభాగాన్ని సిరాజ్ ముందుండి నడపనున్నాడు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో కూడిన కూర్పు మంచి ఫలితాలు ఇవ్వడంతో..భారత్ అదే తరహా జట్టును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించింది.

మరోవైపు "బజ్‌బాల్" వ్యూహం పనిచేయకపోవడం ఇంగ్లండ్‌ను కలవరపెడుతోంది. తొలి టెస్టు తర్వాత..... ఇంగ్లండ్ అభిమానులు ఆశించిన మేర ఆ జట్టు ఆకట్టుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలిచి సిరీస్‌లో నిలవాలని భావిస్తున్న ఇంగ్లీష్ జట్టు... కొన్ని మార్పులతో బరిలోకి దిగనుంది. రెహాన్ అహ్మద్ స్థానంలో షోయబ్ బషీర్‌ను తీసుకుంది. స్పిన్ విభాగంలో టామ్ హర్ట్‌లీతో పాటు , సీనియర్ ఆటగాడు జోరూట్ బౌలింగ్ వేసే అవకాశముంది.

తుది జట్లు..

భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమాన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.

ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్.

Tags

Read MoreRead Less
Next Story