WIN: చరిత్ర సృష్టించిన టీమిండియా

WIN: చరిత్ర సృష్టించిన టీమిండియా
కేప్‌టౌన్‌లో గెలుపుతో కొత్త చరిత్ర.. టెస్ట్‌ సిరీస్‌ 1-1తో సమం

భారత క్రికెట్‌ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనను సిరీస్‌ ఓటమి లేకుండా ముగించింది. కేవలం 107 ఓటర్లు సాగిన రెండోటెస్టులో గెలిచిన భారత్‌ టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 3 వికెట్లు కోల్పోయి 12 ఓవర్లలోనే ఛేదించింది. కేప్‌టౌన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌ టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అతి తక్కువ ఓవర్లలో ముగిసిన మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో సఫారీల పతనాన్ని శాసించిన మహ్మద్‌ సిరాజ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా... కేప్‌టౌన్‌లో భారత్‌ తొలి విజయాన్ని నమోదుచేసింది.


దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో ఘన విజయం సాధించిన భారత్‌ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్‌ తేడాతో పరాజయం పాలైన భారత్‌ రెండో టెస్టులో 7 వికెట్లతో గెలిచింది. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 12 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారత పేసర్ల దాటికి 23.2ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ ఆరు వికెట్లు తీయగా జస్‌ప్రీత్‌ బూమ్రా, ముఖేష్‌ కుమార్‌ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ 34.5 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. ఒకదశలో 4 వికెట్లకు 153 పరుగులు చేసిన భారత్‌.. దక్షిణాఫ్రికా బౌలర్ల విజృంభణతో.. ఒక్క పరుగు కూడా జోడించకుండానే చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆడిన దక్షిణాఫ్రికా... ఈ టెస్టు మొదటిరోజునే మూడు వికెట్లు కోల్పోయి..... 62పరుగులు చేసింది.


రెండోరోజైన ఇవాళ రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా ఓపెనర్‌ ఎయిడెన్‌ మాక్రమ్‌ 103 బంతుల్లో 17 ఫోర్లు రెండు సిక్సులతో 106 పరుగులు చేయగా 176 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బూమ్రా ఆరు, ముఖేశ్‌ కుమార్‌ 2, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ కృష్ణ ఒక్కో వికెట్‌ తీశారు. అనంతరం.... 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. తొలి వికెట్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి 44 పరుగులు జోడించిన ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 28 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద పెవిలియన్‌ చేరాడు. తర్వాత శుభ్‌మన్‌గిల్‌ 10, విరాట్‌ కోహ్లీ 12 పరుగులకే వెనుదిరగ్గారోహిత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ జట్టుకు విజయాన్ని అందించారు . ఈ విజయంతో దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్‌ 1-1తో సమంచేసింది. 107 ఓవర్లలోనే ముగిసిన ఈ టెస్టు........ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అత్యల్ప ఓవర్లలోనే ముగిసిన మ్యాచ్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో.... ఆరు వికెట్లతో సఫారీల వెన్నువిరిచిన మహ్మద్‌ సిరాజ్‌కు.. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడిన డీన్‌ ఎల్గర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. ఈసారి దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌ గెలిచిన భారత్‌ ట్వంటీ-20,టెస్ట్‌ సిరీస్‌లు డ్రాచేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story