Wimbledon: నేడే ప్రారంభం, పలు రికార్డులపై కన్నేసిన జకోవిచ్

Wimbledon: నేడే ప్రారంభం, పలు రికార్డులపై కన్నేసిన జకోవిచ్

ప్రతిష్ఠాత్మకమైన వింబుల్డన్ టోర్నమెంట్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. లండన్‌లోని ఆల్ ఇంగ్లాండ్‌ క్లబ్‌లో ఈ టోర్నీ ఆరంభమవనుంది. ఈ గ్రాస్ కోర్ట్ సమరానికి ప్రపంచ టాప్ టెన్నిస్ స్టార్లు పోటీ పడనున్నారు. రెండవ సీడ్‌ ఆటగాడిగా సెర్బియన్ స్టార్ నొవాక్ జకోవిచ్ కూడా టోర్నీలో అడుగుపెట్టనున్నాడు. ఈ నేపథ్యంలో అతన్ని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటికే ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లు కైవసం చేసుకున్నాడు. వింబుల్డన్ గెలిస్తే ఈ సంవత్సరంలో 3వ గ్రాండ్ స్లామ్ టోర్నీ గెలిచినట్లవుతుంది. జకోవిచ్ ఇప్పటికే 23 మేజర్ టైటిళ్లు గెలిచే అత్యధికంగా టైటిళ్లు గెలిచిన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ రికార్డును బద్దలు కొట్టాడు.

ఈ వింబుల్డన్ టోర్నీ గెలిస్తే అత్యధికంగా వింబుల్డన్‌ టైటిళ్లు సాధించిన స్విస్ యోధుడు రోజర్ ఫెదెరర్ 8 టైటిళ్ల రికార్డును సమం చేస్తాడు. ప్రస్తుతం 7 టైటిళ్లతో అమెరికన్ గ్రేట్ క్రీడాకారుడు పీట్ సాంప్రాస్ సరసన రెండవ స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీ గెలిస్తే వరుసగా 5 సంవత్సరాలు వింబుల్డన్‌ విజేతగా నిలిచే మూడవ ఆటగాడిగా నిలవనున్నాడు. ఇంతకు ముందు రోజర్ ఫెదెరర్, బోర్గ్‌లు ఈ ఘనత సాధించారు.



స్పెయిన్ ఆటగాడు రఫెల్ నాదల్ గాయంతో టోర్నీ నుంచి దూరం కావడంతో జకోవిచ్‌కి ఈ టోర్నీలో పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనబడటం లేదు. నంబర్ 1 ర్యాంకర్, టాప్ సీడ్‌గా టోర్నీలో అడుగుపెడుతున్న అల్కజార్ నుంచి మాత్రమే జకోవిచ్‌కి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సంవత్సరం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ సెమీ ఫైనల్‌లో అల్కాజార్‌ని, జకోవిచ్ ఓడించాడు. అయితే ఏటీపీ మాస్టర్స్ 1000 మాడ్రిడ్ టోర్నీలో అతడి చేతిలో పరాజయం పాలు కావడం గుర్తించదగ్గ విషయం. అయితే జకోవిచ్ తన మొదటి రౌండ్‌లో వరల్డ్ 67వ ర్యాంకు ఆటగాడు పెడ్రో కాచిన్‌తో తలపడనున్నాడు.

మహిళల సింగిల్స్‌లో 5 సార్లు వింబుల్డన్ విజేత వీనస్ విలియమ్స్ తన మొదటి రౌండ్‌లో టోక్యో ఒలంపిక్స్ కాంస్య పతక విజేత ఎలీనా స్వితోలీనాతో తలపడనుంది.

భారత్ నుంచి మెన్స్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న మాత్రమే పోటీలో ఉన్నాడు. రోహన్ ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎడెన్‌తో జతకట్టాడు. ఈ జోడీ ఈ సంవత్సరంలో ఖతార్ ఓపెన్, ఇండియన్ వెల్స్ మాస్టర్స్ ఛాంపియన్‌షిప్‌ని గెలిచి వింబుల్డన్‌ కూడా గెలవాలన్న కసితో ఉన్నారు.

టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన మాజీ క్రీడాకారిణి సానియా మీర్జా, రిటైర్డ్ అథ్లెట్లతో నిర్వహించనున్న ఒక మ్యాచ్‌లో బరిలో దిగనుంది. బ్రిటన్‌కి చెందిన జోహాన్న కోంటాతో డబుల్స్‌లో జత కట్టనుంది.

Tags

Read MoreRead Less
Next Story