IND VS WI: ఓపెనర్ల విధ్వంసం... సిరీస్‌ సమం

IND VS WI: ఓపెనర్ల విధ్వంసం... సిరీస్‌ సమం
వెస్టిండీస్‌తో నాలుగో టీ ట్వంటీలో టీమిండియా ఘన విజయం.... చెలరేగిన జైస్వాల్‌, గిల్‌

సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. అద్భుత ఆటతీరుతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-2తో సమం చేసింది.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. షిమ్రాన్‌ హెట్‌మైర్‌ 3 ఫోర్లు, 4 సిక్సులతో విధ్వంసం సృష్టించాడు. కేవలం 39 బంతులు ఎదుర్కొన్న హెట్‌మైర్‌ 61 పరుగులు చేశాడు. షై హోప్‌ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ మూడు వికెట్లు, కుల్దీప్‌ యాదవ్‌ రెండు, ముఖేష్‌ కుమార్‌ ఒక వికెట్‌ సాధించారు. కుల్‌దీప్‌ ఒకే ఓవర్లో ప్రమాదకర పూరన్‌ (1)తో పాటు కెప్టెన్‌ పావెల్‌ (1)ను అవుట్‌ చేశాడు. లేకపోతే విండీస్‌ ఇంకా ఎక్కువ స్కోరే చేసేది. చివరి అయిదు ఓవర్లలో విండీస్‌ 57 పరుగులు రాబట్టింది.


అనంతరం 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్లు యశస్వి, శుభ్‌మన్‌ వీరవిహారం చేయడంతో భారత జట్టు అలవోకగా విజయాన్ని అందుకుంది. యశస్వి జైస్వాల్‌ (84 నాటౌట్‌; 51 బంతుల్లో 11×4, 3×6), శుభ్‌మన్‌ గిల్‌ (77; 47 బంతుల్లో 3×4, 5×6) చెలరేగడంతో భారత్‌ 17 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు తొలి వికెట్‌కు 165 పరుగుల జోడించి జట్టు విజయాన్ని ఖరారు చేశారు.


గత మ్యాచ్‌లో టీ20 అరంగేట్రంలో విఫలమైన యశస్వి ఈ సారి అవకాశాన్ని వదల్లేదు. ధనాధన్‌ షాట్లతో చెలరేగాడు. కచ్చితమైన టైమింగ్‌తో, ఖాళీల్లో నుంచి ఫోర్లు రాబట్టాడు. శుభ్‌మన్‌ కూడా తిరిగి లయ అందుకుంటూ దూకుడు ప్రదర్శించాడు. ఓపెనర్ల విధ్వంసంతో భారత్‌ 66/0తో పవర్‌ప్లేను ముగించింది. ఆ తర్వాత కూడా ఓపెనర్లు జోరు కొనసాగించారు. విండీస్‌ బౌలింగ్‌నూ సమర్థంగా ఎదుర్కొన్నారు. 10 ఓవర్లకు సరిగ్గా 100 పరుగులు సాధించిన టీమ్‌ఇండియా.. లక్ష్యం దిశగా వడివడిగా దూసుకెళ్లింది. బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా బ్యాటర్లు సాధికారికంగా బ్యాటింగ్‌ కొనసాగించారు. షెఫర్డ్‌ ఓవర్లో భారీ సిక్సర్‌ సాధించిన గిల్‌.. మరో షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. తిలక్‌వర్మతో కలిసి యశస్వి లాంఛనాన్ని పూర్తిచేశాడు.

ఈ మ్యాచ్‌లో దుమ్మురేపిన జైశ్వాల్‌, గిల్‌ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. టీ20ల్లో భారత తరపున రెండో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జంటగా గిల్‌, జైశ్వాల్‌ నిలిచారు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ-రాహుల్‌ రికార్డును ఈ యువ జోడీ సమం చేసింది. వెస్టిండీస్-భారత్‌ మధ్య నిర్ణయాత్మకమైన అయిదో టీ ట్వంటీ నేడు జరగనుంది.

Tags

Read MoreRead Less
Next Story