ICC WORLD CUP: ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం

ICC WORLD CUP: ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం
134 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన ప్రొటీస్‌.... ఆసిస్‌కు వరుసగా రెండో ఓటమి...

ప్రపంచకప్‌ రెండో మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికా అదరగొట్టింది. ఆస్ట్రేలియాను 177 పరుగులకే చిత్తు చేసి 134 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అన్ని విభాగాల్లో రాణించిన దక్షిణాఫ్రికా జట్టు... ఆస్ట్రేలియాపై ఏకపక్ష విజయం సాధించింది. తొలుత టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా... ప్రొటీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దక్షిణాఫ్రికా 50 ఓవరల్లో ఏడు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేయగా... కంగారు జట్టు 177 పరుగులకే కుప్పకూలింది. దీంతో 134 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఆసిస్‌ చిత్తయింది. ఈ గెలుపుతో ప్రొటీస్‌ ఈ ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయం నమోదు చేయగా.. ఆస్ట్రేలియా వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది.


దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ (109: 106 బంతుల్లో) వరుసగా రెండో సెంచరీతో చెలరేగాడు. ప్రొటీస్‌ ఓపెనర్లు క్వింటన్ డికాక్, టెంబా బవుమా ప్రారంభంలో కాస్త ఆచితూచి ఆడారు. మొదటి వికెట్‌కు 108 పరుగులు జోడించిన అనంతరం గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో బవుమా అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రాసీ వాన్ డర్ డుసెన్‌తో కలిసి డికాక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. దూకుడుగా ఆడిన డికాక్‌ 91 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. డికాక్‌ను క్లీన్ బౌల్డ్ చేసి మ్యాక్స్‌వెల్ ఆస్ట్రేలియాకు మూడో వికెట్‌ అందించాడు. మిగిలిన బ్యాటర్లు కూడా రాణించడంతో ప్రొటీస్ నిర్ణీత 50 ఓవర్లలో 311 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 2, మ్యాక్స్‌వెల్‌ 2 వికెట్లు తీశారు.

అనంతరం 312 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లకు దక్షిణాఫ్రికా బౌలర్లు చుక్కలు చూపించారు. సఫారీ బౌలర్ల విజృంభణతో ఏ దశలోనూ కంగారు జట్టు విజయం దిశగా సాగలేదు. అయిదో ఓవర్లో మిచెల్‌ మార్ష్‌ను అవుట్‌ చేసిన జాన్సన్‌ ఆస్ట్రేలియా బ్యాటర్ల పతనాన్ని ఆరంభించాడు. 27 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన కంగారు జట్టు... అదే స్కోరు వద్ద రెండో వికెట్‌ కూడా కోల్పోయింది. డేవిడ్‌ వార్నర్‌ను ఎంగిడి పెవిలియన్‌కు పంపాడు. తర్వాత కూడా ఆస్ట్రేలియా వికెట్ల పతనం కొనసాగింది. స్టీవ్‌ స్మిత్‌, లబుషేన్‌ కాసేపు పోరాడినా.. దక్షిణాఫ్రికా బౌలర్ల ముందు నిలవలేకపోయారు. 19 పరుగులు చేసిన స్మిత్‌ను రబాడ, 46 పరుగులు చేసిన లబుషేన్‌ను మహారాజ్ అవుట్‌ చేశారు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆస్ట్రేలియా 70 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తర్వాత కూడా దక్షిణాఫ్రికా జట్టు పట్టు విడవక పోవడంతో 177 పరుగులకే కంగారు జట్టు కుప్పకూలింది. ప్యాట్ కమిన్స్‌ పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించేందుకు మాత్రమే ఉపయోగపడింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ 3, మహరాజ్‌ 2, జాన్సన్‌ 2, షంషీ రెండు వికెట్లు తీశారు.

Tags

Read MoreRead Less
Next Story