ODI World Cup: బవుమా సారధ్యంలోనే బరిలోకి

ODI World Cup: బవుమా సారధ్యంలోనే బరిలోకి
వన్డే ప్రపంచకప్‌ కోసం జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా... రిటైర్మెంట్‌ ప్రకటించిన డికాక్‌..

భారత్‌ వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌(ODI World Cup 2023)నకు సమయం సమీపిస్తున్న వేళ ఆయా దేశాల క్రికెట్‌ బోర్డులు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే రోహిత్‌శర్మ సారథ్యంలో టీమిండియా జట్టును ప్రకటించగా.. తాజాగా దక్షిణాఫ్రికా(South Africa) కూడా ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసింది. తెంబా బావుమా కెప్టెన్‌గా 15 మందితో కూడిన జట్టును సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. సీనియర్‌ బ్యాటర్‌లు క్వింటన్ డికాక్, రిజా హెండ్రిక్స్‌, మార్‌క్రమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, డస్సెన్‌లకు ప్రపంచకప్‌ జట్టులో దక్కింది. కాగిసో రబాడ పేస్ దళాన్ని నడిపించనున్నాడు. స్టార్ పేసర్లు అన్రిచ్‌ నోకియా, లుంగి ఎంగిడిలను జట్టులోకి తీసుకున్నారు. కేశవ్ మహరాజ్‌, తబ్రెయిజ్‌ షంసీ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు.


దక్షిణాఫ్రికా జట్టు:

తెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగల, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్‌క్రమ్‌, డస్సెన్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, నోకియా, కాగిసో రబాడ, తబ్రెయిజ్‌ షంసీ.

డికాక్‌ సంచలన నిర్ణయం


వ‌ర‌ల్డ్ క‌ప్ స్క్వాడ్ ఎంపిక‌కు ముందుగానే ద‌క్షిణాఫ్రికా విధ్వంస‌క ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్ (Quinton de Kock) అభిమానుల‌కు షాకింగ్ న్యూస్ చెప్పాడు. ప్రపంచ క‌ప్ త‌ర్వాత వ‌న్డేలకు గుడ్ బై చెప్పనున్నట్టు వెల్లడించాడు. 2021లో హఠాత్తుగా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన 30 ఏళ్ల డికాక్‌ టీ20ల్లో మాత్రం కొనసాగనున్నాడు. డికాక్‌ ఇప్పటివరకు 140 వన్డేలు ఆడి 44.85 సగటుతో 5,966 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 17 సెంచరీలు, 29 అర్ధ సెంచరీలు బాదాడు. ద‌క్షిణాఫ్రికా క్రికెట్‌కు డికాక్ ఎంతో సేవ చేశాడని, త‌న‌ ఆటాకింగ్ బ్యాటింగ్‌తో చాలా ఏళ్లుగా జ‌ట్టులో కీల‌క ఆట‌గాడిగా కొన‌సాగాడని దక్షిణాఫ్రికా క్రికెట్ డైరెక్టర్ ఎనోచ్ కెవే కొనియాడాడు.

12 ఏళ్ల తర్వాత భారత్‌ వన్డే వరల్డ్‌కప్‌నకు అతిథ్యం ఇస్తోంది. ఆక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఇంగ్లండ్‌- న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లు ప్రిలిమనరీ జట్లను ప్రకటించాయి.టీమిండియాతో పాటు ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, అఫ్గనిస్తాన్‌, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌ తదితర పది జట్లు ఈ మెగా టోర్నీలో టైటిల్‌ కోసం తలపడనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story