Asia Games: నిబంధనలు సడలించిన కేంద్రం, ఆడనున్న భారత ఫుట్‌బాల్ జట్టు

Asia Games: నిబంధనలు సడలించిన కేంద్రం, ఆడనున్న భారత ఫుట్‌బాల్ జట్టు
ప్రస్తుతం ఆసియా ఫుట్‌బాల్‌లో భారత జట్టు 19వ స్థానంలో ఉంది. కానీ ప్రస్తుతం ఈ నిబంధనను సడలించడంతో ఆసియా క్రీడల్లో పాల్గొనడానికి మార్గం సుగమమైంది.

Asia Games: ఆసియా క్రీడల్లో ఆడటానికి భారత పురుషుల, మహిళల జట్లను కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీనికోసం ఇన్ని రోజులుగా పెట్టుకున్న ఒక నిబంధనను సవరించింది. ఈ నేపథ్యంలో సునీల్ ఛెత్రీ నేతృత్వంలోని భారత జట్టు ఆసియా కప్‌లో ఆడటానికి అడ్డంకులు తొలగిపోయాయి.

ఈ విషయమై కేంద్ర క్రీడల శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశాడు. "కేంద్ర యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ కొన్ని నిబంధనలు సడలించడం ద్వారా భారత్ జట్లను ఆసియా కప్‌కి పంపించే వీలు కల్పిస్తున్నాం. ఇటీవల భారత జట్టు సాధించిన ఘనతల ఆధారంగా నిబంధనలు సడలించాం. ఆసియా క్రీడల్లో భారత జట్టు గొప్పగా రాణించి, మన దేశాన్ని గర్వించేలా చేస్తారన్న నమ్మకం మాకుంది" అని వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ర్యాంకింగ్స్‌లో టాప్-8 లో ఉన్న జట్లు మాత్రమే ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఆసియా ఫుట్‌బాల్‌లో భారత జట్టు 19వ స్థానంలో ఉంది. కానీ ప్రస్తుతం ఈ నిబంధనను సడలించడంతో ఆసియా క్రీడల్లో పాల్గొనడానికి మార్గం సుగమమైంది.

2018లో జకార్తాలో జరిగిన గత ఆసియా క్రీడల్లో భారత జట్టు ఈ నిబంధన కారణంగా పోటీలో పాల్గొనలేదు. అయితే ఇటీవల సునీల్ ఛెత్రీ నేతృత్వంలోని పురుషుల జట్టు అద్భుత ప్రదర్శనతో శాఫ్ ఛాంపియన్‌షిప్, ఇంటర్‌ కాంటినెంటనల్ కప్‌లను గెలిచి సత్తా చాటింది. సునీల్ ఛెత్రీ సూపర్ ఫాంలో ఉండటం భారత్‌కు అత్యంత కీలకంగా మారింది. ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్లలో 23 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న ఆటగాళ్లు ముగ్గురు మాత్రమే ఉండాలనే నిబంధన కూడా ఉంది.

భారత జట్టు ప్రధాన కోచ్ ఐగర్ స్టిమాక్, ఆసియా క్రీడల్లో భారత జట్టు పాల్గొనే విషయంలో కలగజేసుకోవాలని ప్రధాని మోదీని కోరాడు.


"గౌరవనీయులైన ప్రధాని మోదీజీ, ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్ జట్టు పాల్గొనడం లేదని మీకు ఎవరూ వెల్లడించదనుకుంటున్నాను. అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన ఆట ఫుట్‌బాల్‌లో మన జట్టు గత 4 సంవత్సరాలుగా తీవ్రంగా శ్రమిస్తూ, పలు ఘనతలు సాధించింది. ఈ ఆసియా క్రీడల్లో భారత జెండా కింద జట్టు ప్రాతినిధ్యం వహించడం లేదు" అని ఓ ట్వీట్ ద్వారా ప్రధాని మోదీని కోరాడు.


Tags

Read MoreRead Less
Next Story