Viacom18: వయాకామ్‌ 18 చేతికే బీసీసీఐ మీడియా హక్కులు

Viacom18: వయాకామ్‌ 18 చేతికే బీసీసీఐ మీడియా హక్కులు
దాదాపు రూ. 6 వేల కోట్ల రూపాయలకు దక్కించుకున్న సంస్థ...టీవీ ప్రసార హక్కులతో పాటు డిజిటల్‌ ప్రసార హక్కులు సొంతం

వచ్చే ఐదేళ్లు భారత్‌లో జరిగే అన్ని క్రికెట్ టోర్నమెంట్ల టెలివిజన్, డిజిటల్ ప్రసార హక్కుల(digital and TV media rights)ను వయాకామ్ -18(Viacom18) సంస్థ దక్కించుకుంది. టెలివిజన్‌, డిజిటల్ ప్రసార హక్కులను వయాకామ్ సంస్థ రూ.5,963 కోట్ల($720 million)కు దక్కించుకున్నట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి BCCI అధికారికంగా ప్రకటించింది. స్వదేశంలో 2023-28 సీజన్‌( period 2023-28)లో జరగనున్న అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌ల(international and domestic)ను ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం వయాకామ్‌కు వచ్చింది.


ఈ కాంట్రాక్టు కింద వచ్చే ఐదేళ్లు భారత్ లో జరిగే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌ల టెలివిజన్ , డిజిటల్ ప్రసార హక్కులు వయాకామ్ -18కు దక్కుతాయని.. భారత క్రికెట్ నియంత్రణ మండలి-BCCI ఓ ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 2023 నుంచి మార్చి 2028 వరకు అంతర్జాతీయంగా 102 ద్వైపాక్షిక మ్యాచ్‌లు(102 international matches)ప్రసారం చేసే హక్కులను వయాకామ్‌ 18 దక్కించుకుంది. ఇందులో 25 టెస్టులు, 27 వన్డేలు, 36 అంతర్జాతీయ టీ20లు ఉన్నాయి.

డిజిటల్ హక్కుల కోసం 3వేల 101 కోట్లు, టెలివిజన్ ప్రసార హక్కుల కోసం 2వేల 862 కోట్ల రూపాయలు వయాకామ్ సంస్థ చెల్లిస్తుందని BCCI వివరించింది. భారత్ ఆడే ఒక్కో మ్యాచ్ కు దాదాపు 67 కోట్ల రూపాయలు చెల్లించనుంది. ఐపీఎల్ ప్రసార హక్కులను ఇప్పటికే వయాకామ్ -18 దక్కించుకుంది. ఈ ఒప్పందం కింద భారత్ లో జరిగే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ మ్యాచ్ ల ప్రసారాలు స్పోర్ట్స్ 18లో, డిజిటల్ ప్రసారాలు జియో సినిమా ప్లాట్ ఫామ్ లో... అందుబాటులో ఉంటాయి. ఈ హక్కుల కోసం డిస్నీ స్టార్ , సోనీ, వయాకామ్ -18 పోటీ పడ్డాయి.


టీవీ, డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకున్న వయాకామ్‌ 18 సంస్థకు బీసీసీఐ కార్యదర్శి జైషా అభినందనలు తెలిపారు. బీసీసీఐ మీడియా హక్కులను దక్కించుకున్న వయాకామ్‌ 18కి శుభాకాంక్షలని, వచ్చే ఐదేళ్ల కాలంలో భారత క్రికెట్‌లో మరిన్ని మార్పులు చోటు చేసుకుంటాయని జై షా ట్వీట్‌ చేశారు. ఐపీఎల్‌, మహిళా టీ20 క్రికెట్‌ లీగ్‌ తర్వాత భారత క్రికెట్‌ ఉన్నతస్థానాలకు చేరుకుందని, క్రికెట్ అభిమానులకు అంచనాలను కలిసి చేరుకోగలమనే నమ్మకం ఉందని పోస్ట్‌ చేశారు. అలాగే ఈ-వేలంలో పాల్గొన్న స్టార్ ఇండియా, డిస్నీ హాట్‌స్టార్‌కు ధన్యవాదాలు తెలిపిన జై షా... ఎన్నో ఏళ్లుగా మద్దతుగా నిలిచారని ట్విటర్ వేదికగా స్పందించారు.

Tags

Read MoreRead Less
Next Story