IND vs AUS: ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో భారత్‌ శుభారంభం

IND vs AUS: ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో భారత్‌ శుభారంభం
ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం.... కోహ్లీ, రాహుల్‌ అద్భుత బ్యాటింగ్‌

ప్రపంచకప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది. కంగారులు చేసిన 200 పరుగులు కూడా కొండంత లక్ష్యంలా కనిపిస్తున్న వేళ... 2 పరుగులకే మూడు వికెట్లు నేలకూలిన సమయాన.. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో... సవాళ్లను అధిగమించి... విరాట్‌ కోహ్లీ, కే.ఎల్‌. రాహుల్‌ అద్భుతమే చేశారు. తాను గ్రేట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ ఎందుకో కోహ్లీ నిరూపించగా... రాహుల్‌ ఫామ్‌ను చాటుతూ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. తమ అపార అనుభవంతో ఈ ఇద్దరు ఆటగాళ్ల తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ ఆసీస్‌ పేసర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టును విజయతీరాలకు చేర్చారు.


టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. స్పిన్నర్ల ముప్పేట దాడితో కంగారుల ఇన్నింగ్స్‌ ఏ దశలోనూ సాఫీగా సాగలేదు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే బుమ్రా అద్భుతమైన బంతితో మిచెల్‌ మార్ష్‌ డకౌట్‌ చేశాడు. ఫామ్‌లో ఉన్న వార్నర్‌కు స్మిత్‌ జత కలవగా.. ఈ ఇద్దరూ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ భాగస్వామ్యానికి కుల్‌దీప్‌ తెరదించాడు. అర్ధసెంచరీ దిశగా సాగుతున్న వార్నర్‌ను అతను తన మూడో ఓవర్లో రిటర్న్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. లబుషేన్‌ (27)తో కలిసి స్మిత్‌ స్కోరును వంద దాటించాడు. 110/2తో ఆసీస్‌ మంచి స్థితికి చేరుకుంది. ఈ దశలో జడేజా.. రెండు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను గట్టి దెబ్బ తీశాడు. ముందుగా స్మిత్‌ను అద్భుతమైన బంతితో బౌల్డ్‌ చేసిన జడ్డూ.. తర్వాతి ఓవర్లో లబుషేన్‌, కేరీ (0)లను పెవిలియన్‌ చేర్చాడు. దీంతో ఆసీస్‌ 119/5తో పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. మ్యాక్స్‌వెల్‌ (15), గ్రీన్‌ (8) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా.. జట్టును రక్షించలేకపోయారు. స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరూ ఔట్‌ కావడంతో ఆసీస్‌ 140/7కు చేరుకుంది. ఈ దశలో కమిన్స్‌ (15)తో కలిసి స్టార్క్‌ (28) పోరాడటంతో ఆసీస్‌.. 200 లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజిల్‌వుడ్ మూడేసి వికెట్లు దక్కించుకున్నారు.


200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే కోలుకోలేని షాక్ తగిలింది. మొదటి ఓవర్లోనే ఇషాన్ కిషన్‌ను స్టార్క్‌ డకౌట్‌ చేయగా.. రెండో ఓవర్లో రోహిత్ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌లను హాజిల్‌వుడ్ అవుట్‌ చేశాడు. దీంతో భారత్ కేవలం రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇక భారత్ కోలుకోవడం కష్టమే అనుకున్నారు. కానీ విరాట్ కోహ్లీ (85: 116 బంతుల్లో, ఆరు ఫోర్లు), కేఎల్ రాహుల్ (97 నాటౌట్: 115 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు) మాత్రం అదరగొట్టారు.

ప్రారంభంలో వికెట్లు కాపాడుకోవడానికి మెల్లగా ఆడిన ఈ జోడి మెల్లగా గేర్లు మార్చింది. నాలుగో వికెట్‌కు ఏకంగా 165 పరుగులు జోడించి భారత్‌ను విజయం ముంగిట వీరు నిలిపారు. కింగ్ కోహ్లీ శతకం మార్కును అందుకుంటాడు అనుకున్నా... విజయానికి కొద్ది పరుగుల ముంగిట అవుటయ్యాడు. కానీ కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాతో (11 నాటౌట్: 8 బంతుల్లో, ఒక సిక్సర్) కలిసి మ్యాచ్‌ను ముగించాడు. 1999 తర్వాత ఆస్ట్రేలియా ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే మొదటి సారి.

Tags

Read MoreRead Less
Next Story