Ashes Test: బెన్‌ స్టోక్స్‌ అత్యుత్తమం అంటూ విరాట్‌ కోహ్లీ ప్రశంసలు..

Ashes Test: బెన్‌ స్టోక్స్‌ అత్యుత్తమం అంటూ విరాట్‌ కోహ్లీ ప్రశంసలు..

ఆదివారం జరిగిన యాషెస్ సిరీస్‌ రెండవ టెస్ట్, చివరి రోజున ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌ స్టోక్స్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేలా ఇన్నింగ్స్ ఆడాడు. 4వ ఇన్నింగ్స్‌లో ఎంతటి భీకర ఫామ్‌లో ఉన్న జట్టుకైనా 300 పరుగుల పైగా లక్ష్య ఛేదన కష్టమే. ఇంతకు ముందు 2019 సంవత్సరంలో లీడ్స్‌ టెస్ట్‌లో వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడి, ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి టెస్ట్ చరిత్రలో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన స్టోక్స్ నిన్న మళ్లీ దీన్ని రిపీట్‌ చేసేలా కనిపించాడు. 214 బంతుల్లో 155 (9 x 4, 9 x 6) పరుగులు చేసిన స్టోక్స్ జట్టు విజయానికి కేవలం 70 పరుగులు అవసరమైన దశలో ఔటై వెనుదిరిగాడు. మ్యాచ్‌ ఓడినప్పటికీ స్టోక్స్ ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచిపోరు.

స్టోక్స్ ఇన్నింగ్స్‌పై తాజా, మాజీ క్రికెటర్లు పొగడ్తలతో ముంచెత్తారు. భారత మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ స్టోక్స్ ఇన్నింగ్స్‌పై స్పందించాడు. తాను చూసిన ఆటగాళ్లలో బెన్‌స్టోక్స్ అత్యంత పోటీతత్వం గల ఆటగాడని కితాబిచ్చాడు. ప్రస్తుతం క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టు చాలా బలంగా ఉందని అన్నాడు.



"నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా నేను ఎదుర్కొన్న ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ అత్యంత పోటీతత్వం ఉన్న ప్లేయర్. స్టోక్స్ ఆడిన ఇన్నింగ్స్ అత్యుత్తమమైనది. కానీ ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుత తరుణంలో చాలా బలంగా ఉండటంతో విజయం వారిదైంది " అంటూ ట్వీట్ చేశాడు.


ఆదివారం జరిగిన యాషెస్ 2వ టెస్ట్ చివరి రోజున బెన్‌స్టోక్స్ న అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్‌ను గెలుపు అంచుల దాకా తెచ్చాడు. బెయిర్‌స్టో వివాదాస్పద ఔట్ తర్వాత గేర్లు మార్చి వరుస బౌండరీలు, సిక్స్‌లతో తన విశ్వరూపం ప్రదర్శించాడు. 2 ఈ క్రమంలో ఇంగ్లాండ్ తరపున 4వ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్‌ సాధించిన కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. ఆదివారం జరిగిన యాషెస్ రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 43 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్‌లో 2-0 తేడాతో ముందంజలో నిలిచింది.


Tags

Read MoreRead Less
Next Story