Who is Mirabai Chanu : ఎవరీ మీరాబాయి చాను.. ఎక్కడినుంచి వచ్చింది.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే..

Who is Mirabai Chanu : ఎవరీ మీరాబాయి చాను.. ఎక్కడినుంచి వచ్చింది.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే..
చిన్నతనంలో అన్నతో పాటు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లేది. అన్న కంటే మీరానే ఎక్కువ కట్టెలు మోసుకుని వచ్చేది.

చిన్నతనంలో అన్నతో పాటు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లేది. అన్న కంటే మీరానే ఎక్కువ కట్టెలు మోసుకుని వచ్చేది. అది మీరా తల్లిదండ్రులను ఆశ్చర్యపరిచేది. వెయిట్ లిప్టింగ్‌కు అప్పుడే బీజం పడింది. మీరాబాయి చాను ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద వెయిట్ లిఫ్టింగ్ స్టార్లలో ఒకరుగా రాణిస్తూ ఒలిపింక్ క్రీడల్లో భారతదేశ కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ విను వీధుల్లో ఎగురవేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల 49 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్‌లో రజత పతకం సాధించడంతో మణిపూర్‌లోని తూర్పు ఇంఫాల్ జిల్లాకు చెందిన సైఖోమ్ మీరాబాయి చాను చరిత్రను సృష్టించింది.

ఆమె అంతర్జాతీయ వేదికపై పోటీ చేయడం ద్వారా అంతర్జాతీయ పతకాలు సాధించడంతో పాటు చిన్న వయస్సులోనే గుర్తింపు పొందడం ప్రారంభించింది. దాంతో మీరాబాయి ఎవరు.. ఆమె నేపథ్యం ఏంటి అనే ఆసక్తి అందరిలో నెలకొంది. మీరాబాయి గూగుల్‌లో సెర్చ్ చేయండం ప్రారంభించారు. మణిపూర్ రాజధాని నగరం ఇంఫాల్‌కు చెందిన మీరాబాయి చాను 1994 ఆగస్టు 8 న జన్మించారు.

ఆమె 11 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు స్థానిక వెయిట్ లిఫ్టింగ్ పోటీలో మొదటి బంగారు పతకాన్ని గెలుచుకుంది. తరువాత, ఆమె ప్రపంచ మరియు ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొనడం ద్వారా అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైంది. అక్కడ కూడా పతకాలు సాధించింది. భారతీయ వెయిట్ లిఫ్టర్ కుంజరాణి దేవిని స్ఫూర్తిగా తీసుకుంటుంది మీరాబాయి.

20 ఏళ్ల వయసులో స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన 2014 కామన్వెల్త్ క్రీడల్లో 48 కిలోల విభాగంలో రజత పతకం సాధించినప్పుడు మీరాబాయి చాను అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను ప్రదర్శించింది. 2017 లో అమెరికాలోని అనాహైమ్‌లో జరిగిన ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మీరాబాయి బంగారు పతకం సాధించింది. రెండు దశాబ్దాల్లో ఈ పతకం సాధించిన తొలి భారతీయ వెయిట్ లిఫ్టర్‌గా ఆమె నిలిచింది.

2018 లో చాను వెన్నునొప్పికి గురైంది. అప్పుడు ఆమెకు ఏడాది కాలంపాటు ఈవెంట్లలో పాల్గొనడం సాధ్యం కాలేదు. 2019 లో థాయ్‌లాండ్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె పున:ప్రవేశం అద్భుతంగా జరిగింది. నాల్గవ స్థానంలో ఉన్నప్పటికీ, ఆమె కెరీర్‌లో తొలిసారిగా 200 కిలోల మార్కును అధిగమించి ఈ ఈవెంట్‌ను చిరస్మరణీయం చేసింది.

ఏప్రిల్‌లో తాష్కెంట్‌లో జరిగిన 2021 ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో, మీరాబాయి చాను 119 కిలోల లిఫ్ట్‌తో మహిళల 49 కిలోల క్లీన్ అండ్ జెర్క్‌లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. మరోవైపు, స్నాచ్‌లో సబ్‌పార్ ప్రదర్శన కారణంగా చాను ఆసియా మీట్‌లో కాంస్య పతకం గెలుచుకుంది. అప్పుడు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బిరెన్ సింగ్ చానును సన్మానిం ఆమెకు 2 కోట్ల రూపాయల బహుమతి ఇచ్చారు.

2018 లో మీరాకు భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారం అయిన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న లభించింది. 2018 లోనే చానుకు భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ 2020 లో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ గెలుచుకుంది. వెయిట్ లిఫ్టింగ్‌లో భారత బృందం నుండి పోటీ పడుతున్న ఏకైక భారతీయ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను కావడం మన భారతీయులకు గర్వకారణం.

Tags

Read MoreRead Less
Next Story