Cyber Crime: ఫోన్లలో ఇటువంటి యాప్స్‌ వాడితే జర జాగ్రత్త

Cyber Crime: ఫోన్లలో ఇటువంటి యాప్స్‌ వాడితే జర జాగ్రత్త
*యాప్‌లకు అనుమతులు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే ప్రమాదాల్ని అరికట్టవచ్చు

మొబైల్ ఫోన్లు లేకుంటే ప్రపంచం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఫోన్ మన జీవితంలో ఒక భాగం, కాదు కాదు అంతకు మించి అయింది. ఇంటర్నెట్ వచ్చాక గత దశాబ్ధ కాలంలో ఫోన్లలో కోట్లాది యాప్స్ వచ్చి చేరాయి. యాప్స్‌తో పాటు ప్రమాదాలు జతచేరాయి. యాప్స్‌లో ఉండే లూప్‌హోల్స్ ఉపయోగించుకుని సైబర్ క్రిమినళ్లు వినియోగదారుల ఫోన్లల్లోకి జొరబడుతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ప్రమాదం కొద్దిగా ఎక్కువే. ఐఫోన్లలోనూ జైల్ బ్రేక్ చేసిన ఫోన్లల్లో హ్యాకర్లు ప్రవేశించగలుగుతున్నారు.


హ్యాకర్లు, సైబర్ క్రిమినళ్లు యాప్‌ల ద్వారా వ్యక్తుల ఫోన్లలో ఉంటూ తమకు కావాల్సిన విధంగా వాడుకుంటున్నారు. కొందరు ఫోటోలు, వీడియోలు తస్కరించి బెదిరింపులకు దిగుతున్నారు. మరికొందరకు మీరు ఫోన్లో టైప్ చేసే వివరాల్ని తస్కరించి, బహుళ జాతి సంస్థలకు భారీ మొత్తాల్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

పేగ్ మలన్ అనే సైబర్ క్రైం అడ్వైజర్ ప్రమాదకర యాప్‌లను వర్గీకరిస్తూ అవి ఎలా డేటాని తస్కరిస్తాయో వెల్లడించాడు.


మొదటగా ఫోన్‌లో యాంటీ వైరస్‌లు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. ఫోన్లో ఎటువంటి వైరస్‌లు, మాల్‌వేర్ రాకుండా ఇవి అడ్డుకుంటాయి. అయితే సైబర్ క్రిమినళ్లు ఈ అవసరాన్ని ఆసరాగా తీసుకుని నకిలీ యాంటీ వైరస్‌ యాప్‌ల రూపంలో మొబైల్ ఫోన్లలో వీటిని వినియోగదారులు డౌన్‌లోడ్ చేసేలా చేస్తారు. వీటిని ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ వంటి అధికారిక స్టోర్ల నుంచి కాకుండా, థర్డ్ పార్టీల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రోత్సహిస్తుంటారు. ఇవి వైరస్‌లను అడ్డుకునే పనికాకుండా దానికి అచ్చం వ్యతిరేకంగా వైరస్‌లను ఫోన్‌లో చొప్పిస్తూ ఫోన్లోని డేటాని తస్కరిస్తాయి.

మరో రకం యాప్స్ అచ్చంగా ఒరిజినల్ యాప్‌లను పోలి ఉంటాయి. వీటిని ఉపయోగించి ఆర్థికపరమైన మోసాలు జరుపుతుంటారు. వాటి లోగో, అక్షరాలు అన్నీ ఒరిజనల్‌లా ఉంటూ వినియోగదార్లను మోసం చేస్తుంటారు. అది నకిలీదని తెలియని వారు సాధారణంగానే తమ లాగిన్ యూజర్‌ నేమ్, పాస్‌వర్డులను ఎంటర్ చేస్తారు. క్రిమినళ్లు ఈ సమాచారాన్ని ఒరిజినల్‌ యాప్లో ఉపయోగించి మన ఖాతాలోని వివరాలు లేదా సొమ్మును కాజేస్తారు.



స్పైవేర్ రకం యాప్స్ వ్యక్తుల ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం అంటే ఫోటోలు, వీడియోలు, లొకేషన్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ ట్రాక్ చేస్తూ, హ్యాకర్లకు చేరుస్తాయి. ఇవి ముఖ్యంగా వినియోగదారులు ఈ యాప్‌లను వినియోగించడానికి కొన్ని అనుమతులను ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఫోన్లలో ఏది నకిలీదో తెలియని వినియోగదారులు ఫోన్‌లో అన్ని వివరాలు అంటే స్టోరేజ్, కాంటాక్ట్స్, లొకేషన్ వంటి వివరాలకు అనుమతులు ఇవ్వడం ద్వారా తమ సమాచారాన్ని క్రిమినల్స్‌కు చేరవేస్తుంటారు.

అయితే వీటిని వినియోగదారులు సులభంగా గుర్తుపట్టవచ్చు. ఈ యాప్‌లు పదే పదే అనుమతులు కోరుతుంటాయి. ముఖ్యంగా స్టోరేజ్, కెమెరా, మైక్రోఫోన్లను వాడేలా అనుతులు ఇవ్వాలని అడుగుతుంటాయి. వినియోగదారులు వీటిపై అనుమానం వచ్చిన వెంటనే గుర్తించి ఫోన్ నుంచి తొలగించాలి.

Tags

Read MoreRead Less
Next Story