నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ ఘటనలో అధికారుల వివరణ

నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ ఘటనలో అధికారుల వివరణ

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో స్ట్రెచర్ లేక రోగి కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిన ఘటనను ఆస్పత్రి అధికారులు కొట్టిపారేశారు. ఆస్పత్రి సిబ్బందిని, సెక్యూరిటీలను విచారించిన అనంతరం అసలేం జరిగిందో వాస్తవాలతో కూడిన వివరణ ఇచ్చారు. ఈమేరకు ఆస్పత్రి సీసీ ఫుటేజ్‌ను విడుదల చేశారు. సదరు రోగిని అతని తల్లిదండ్రులు మార్చి నెల 31న రాత్రి 10 గంటలకు అస్వస్థతగా ఉన్నాడని ఎమర్జెన్సీ విభాగానికి తీసుకొచ్చారని చెప్పారు. వెంటనే అక్కడ ఉన్న వైద్యులు అతడ్ని పరీక్షించి చికిత్స అందించారు. ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని గుర్తించి ఉదయం జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రత్యేక వైద్యులను సంప్రదించాలని రోగి తల్లిదండ్రులకు తెలిపారు. ఆ తర్వాత పేషెంట్ కేర్ సిబ్బంది.. రోగిని వీల్‌ఛైర్‌లో తీసుకెళ్లి రోగులు వేచి ఉండే హాలులో బెంచ్‌పైన కూర్చోబెట్టి వెళ్లారని ఆస్పత్రి అధికారులు తెలిపారు.

ఉదయం ఎనిమిదన్నర గంటలకు ఓపీ చిట్టి తీసుకుని రెండో అంతస్తుకు వెళ్లవలసి ఉంది. అయితే పేషెంట్ కేర్ సిబ్బంది.. వీల్‌ఛైర్ తీసుకొచ్చే లోపు లిఫ్ట్ వచ్చిందని రోగి తల్లిదండ్రులు లాక్కెళ్తూ తీసుకెళ్లారని ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఆ తర్వాత రెండో అంతస్తు చేరుకున్న అతడిని పేషెంట్ కేర్ సిబ్బంది.. వీల్‌ఛైర్‌లో కూర్చోబెట్టి వైద్యుని వద్దకు తీసుకెళ్లారని చెప్పారు. వైద్యులు పరీక్షించిన తర్వాత తిరిగి గ్రౌండ్‌ఫ్లోర్‌కు అదే వీల్‌ఛైర్‌లో తీసుకొచ్చారని వివరించారు. అయితే ఇదంతా తెలియక ఎవరో ఓ వ్యక్తి రోగిని లాక్కెళ్లే దృశ్యాన్ని మాత్రమే చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారని తెలిపారు. సమగ్రమైన అవగాహన లేకండా, పూర్తి సమాచారం తెలియకుండా ఇలాంటి వీడియోలు తీసి ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం లేకుండా చేసేందుకు దుష్ప్రచారాలు చేయడం బాధాకరమని అన్నారు. ఈ సంఘటనకు ప్రభుత్వాస్పత్రికి ఎలాంటి సంబంధం లేదన్న ఆస్పత్రి అధికారులు.. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story