Summer Heat : భానుడి భగభగలు... బయటకొస్తే మాడు పగిలిపోతోంది

Summer Heat : భానుడి భగభగలు... బయటకొస్తే మాడు పగిలిపోతోంది

సూరీడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. భానుడి భగభగలు సెగలు రేపుతున్నాయి. బయటకొస్తే చాలు మాడు పగిలిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న ఉష్ణోగ్రతలతో ఏపీ, తెలంగాణ నిప్పుల కొలిమిలా సలసల కాగుతున్నాయి.

రెండు రాష్ట్రాల్లోను ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అని తేడా లేదు. ఉదయం నుంచే సూరీడు సుర్రమంటూ ఠారెత్తిస్తున్నాడు. నిన్న హైదరాబాద్‌, రాజమండ్రిలో హాఫ్‌ సెంచరీకి చేరువగా రికార్డుస్థాయిలోఒ 49 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ పలు జిల్లాల్లోను తగ్గేదే లేదంటూ 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఒక్కసారిగా ఎండల తీవ్రత, వడగాల్పులు పెరగడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎన్నడు లేనివిధంగా ఎండలు భగ్గుమంటుండం, ఉక్కపోతతో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అల్లాడిపోతున్నారు.

తెలంగాణలోని సింగరేణి బొగ్గుగనుల ప్రాంతం భగ్గుమంటోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. రామగుండం ఎప్పటిలానే అగ్నిగుండంలా మారింది. వడదెబ్బతో తెలంగాణలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. నిన్న ఒక్కరోజే సన్‌స్ట్రోక్‌తో ముగ్గురు మృతి చెందారు. కొమురం భీం జిల్లాలో ఒకరు, మంచిర్యాల జిల్లాలో మరొకరు, హసన్‌పర్తిలో ఇంకొకరు మృత్యువాత పడ్డారు.

రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీలు, ఏలూరులో 48, భీమవరంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో 46.7 డిగ్రీలతో నిప్పులవర్షం కురుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 46.8 డిగ్రీలు, అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళ్లరేవు మండలంలో 42 డిగ్రీలు, కాట్రేనికొనలో 40 డిగ్రీలు, ముమ్మిడివరంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాబోయే 24 గంటల్లో 20 మండలాల్లో వడగాడ్పులుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటు తెలంగాణలోనూ ఏమాత్రం తగ్గకుండా సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మిర్యాలగూడ 47, పాల్వంచలో 46 డిగ్రీలు, వరంగల్‌, నల్గొండలలో 43, జగిత్యాలలో 44, కొత్తగూడెంలో 46 డిగ్రీలు, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే మూడు రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు మధ్యాహ్నం వేళ అస్సలు బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story