TS POLL: కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన

TS POLL: కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన
తెలంగాణలో మొదలైన ఎన్నికల వేడి.... నేడు కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ

తెలంగాణలో ఎన్నికల పోరు మరింత వేడెక్కింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తుండగా.. ఎలక్షన్ కమిషన్ అధికారుల రాకతో తెలంగాణ పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఎన్నికల సంఘం పర్యటన కొనసాగుతోంది. హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం శాసనసభ ఎన్నికల సన్నాహకాలపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహిస్తోంది. సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, సన్నద్ధతపై ఎన్నికల నిర్వహణ అధికారులు, సంస్థలతో సమీక్షించారు. ప్రలోభాల పర్వంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం, ఇవాళ జిల్లాల వారీగా సమీక్షలు జరపనుంది. జిల్లా ప్రణాళికలను సమీక్షించి కలెక్టర్లు, పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయనుంది. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేలా నియోజకవర్గ స్థాయిలో కార్యాచరణ అమలు చేయనున్నారు.


ఎన్నికల ప్రణాళిక, ఏర్పాట్లతో పాటు ప్రలోభాల పర్వంపై ఎన్నికల సంఘం ఎక్కువగా దృష్టి సారించింది. ఎన్నికల్లో డబ్బు, మద్యం, విలువైన కానుకల పర్వానికి అడ్డుకట్టవేసేలా తీసుకోవాల్సిన పటిష్ఠ చర్యలు, అమలు చేయాల్సిన కార్యాచరణపై ప్రత్యేకంగా ఆరా తీస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సమావేశంలో ప్రలోభాల అంశాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించింది. దక్షిణాదిలో ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యయం భారీగా అవుతోందని, ప్రలోభాల పర్వం కూడా ఎక్కువగా ఉంటోందని కేంద్ర ఎన్నికల సంఘం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గత ఎన్నికలు, మునుగోడు ఉపఎన్నిక సహా అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రలోభాల పర్వానికి అడ్డుకట్ట వేసేలా సమగ్ర కార్యాచరణ రూపొందించి, అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.


ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉన్న నియోజకవర్గాల విషయంలో మరింతగా శ్రద్ధ కనబరచాలని తెలిపింది. డబ్బు, మద్యం తదితరాలను అడ్డుకునేలా నియోజకవర్గ స్థాయిలో పటిష్ట కార్యాచరణ చేపట్టాలని అధికారులు ఇంకా బాగా పనిచేయాలని EC స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్ట్‌ల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సాధించాలని తెలిపింది. శాసనసభ ఎన్నికల కోసం చేస్తున్న ఏర్పాట్లు, ఎన్నికల ప్రణాళికలు, ఇతరత్రా అంశాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ వివరించారు. ప్రలోభాల పర్వానికి అడ్డుకట్టవేసేలా జిల్లా స్థాయిలో వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల సమన్వయంతో రెవెన్యూ ఇంటెలిజెన్స్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రెండో రోజు కార్యక్రమంలో భాగంగా ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం కానుంది .

Tags

Read MoreRead Less
Next Story