20 years of TRS Party: కేసీఆర్ వేసిన ఒక్క అడుగు.. నేటికి 20 ఏళ్ల ప్రస్థానం..

KCR (tv5news.in)

KCR (tv5news.in)

20 years of TRS Party: ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక అజెండాగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ ప్రయాణంలో వైఫల్యాలు, విజయాలు ఎన్నో.

20 years of TRS Party: ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక అజెండాగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ ప్రయాణంలో వైఫల్యాలు, విజయాలు ఎన్నో. చీలికలతో చితికిపోయిన ఆ పార్టీకి ఒక్కోసారి రాజీనామాలే ప్రాణం పోశాయి. తెలంగాణ నినాదంను బలంగా వినిపించడం.. దశాబ్దాల కాలంగా తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటటం.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను వ్యాపింపచేయడంలో టీఆర్ఎస్ దే కీలక పాత్ర. ఇది పార్టీని ముందుకు నడపడానికి ఎంతో దోహదపడింది.

సరిగ్గా రెండు దశాబ్దాల కిందట 2001 ఏప్రిల్‌ 27న తెలంగాణ జాతిని విముక్తం చేయడానికి కేసీఆర్ ఉద్యమ పార్టీని స్థాపించి తొలి అడుగు వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన కేసీఆర్‌.. డిప్యూటీ స్పీకర్‌ పదవికి 2001 ఏప్రిల్‌ 21న రాజీనామా చేశారు. వారం రోజుల్లోనే పార్టీ ప్రకటించారు. జలదృశ్యం వేదికగా కొంతమంది తెలంగాణ వాదుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేశారు.

పదవీ త్యాగపునాది మీద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షతో టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా టీఆర్ఎస్ కంటే ముందు అనేక పార్టీలు ఏర్పడ్డాయి. కొన్నికనుమరుగయ్యాయి. మరికొన్ని కాంగ్రెస్‌లో కలిసిపోయాయి. టీఆర్ఎస్‌దీ అదేపరిస్థితి అనే విమర్శలు వచ్చాయి. మంత్రి పదవి ఇవ్వనందునే కేసీఆర్ పార్టీ పెట్టారని కూడా అన్నారు. అయినా అదరలేదు బెదరలేదు.

రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ వస్తుందని బలంగా నమ్మిన కేసీఆర్.. అదే విజన్‌తో 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని ముందుండి నడిపించి చిరకాల స్వప్నాన్ని నిజం చేశారు. 2001 మే 17న తెలంగాణ సింహగర్జన భారీ బహిరంగ సభతో రణనినాదం మొదలు.. ఎన్నో, ఎన్నెన్నో రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలతో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు.

టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కొన్ని నెలలకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఊహించని స్థాయిలో సీట్లు గెలుచుకుంది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్‌ పదవులు టీఆర్ఎస్ వశం అయ్యాయి. పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా కేసీఆర్ తెలంగాణలోని పది జిల్లాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ భావజాలాన్ని వ్యాపింపచేయడానికి కృషి చేశారు.

టీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరగడంతో నాడు విపక్షంలో ఉన్న కాంగ్రెస్.. టీఆర్ఎస్‌తో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉంటే కాంగ్రెస్‌తో తాము కలవడానికి సిద్ధమని టీఆర్ఎస్ ప్రకటించింది. దానికి కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోవడంతో 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీకి దిగాయి.

2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు, నాటి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాతో కరీంనగర్‌లో ప్రత్యేక తెలంగాణ ఇస్తామని ప్రకటింపజేయడం, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చడం ఒక మైలురాయి. గులాబీ పార్టీ ఈ ఎన్నికల్లో 26 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్‌సభ సీట్లు గెలుచుకుంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చేరింది. ప్రభుత్వంలో భాగమైనా తెలంగాణ ఆకాంక్ష లక్ష్యం వీడలేదు. తెలంగాణకు అనుకూలంగా దాదాపు 36 పార్టీలు ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి లేఖలు ఇవ్వడంలో టీఆర్ఎస్ కృషి చేసింది. అయితే తెలంగాణపై కాంగ్రెస్‌ నాన్చుడు దొరణితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి టీఆర్‌ఎస్‌ వైదొలిగింది.

ఎటూతోచని స్థితిలో ఉన్న టీఆర్‌స్‌కు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎమ్మెస్సార్‌ సవాల్‌ విసరడం.. కేసీఆర్‌ అందిపుచ్చుకుని రాజీనామా చేయడం... కరీంనగర్‌ నుంచి మరోసారి భారీ విజయం సాధించడం టీఆర్‌ఎస్‌లోనూ, తెలంగాణవాదుల్లోనూ జోష్‌ నింపింది. 2009 ఎన్నికల్లో టీడీపీతో టీఆర్ఎస్ జతకట్టి మహాకూటమిగా ఏర్పడింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కేవలం 10 అసెంబ్లీ స్థానాల్లో, 2 ఎంపీ స్థానాల్లోనే గెలుపొందింది.

గులాబీ శ్రేణుల్లో ఒక్కసారిగా నిరాశా నిస్రృహలు. కేసీఆర్‌పై తిరుగుబాట్లు.. వెరసి అయోమయం పరిస్థితి. అయితే ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో కేసీఆర్‌ ఉద్యమాన్ని నడిపించారు. తెలంగాణ వాదం బలహీన పడుతోందని భావించిన ప్రతీసారి రాజీనామాలే అస్త్రంగా ప్రయోగించారు. అయితే కొన్నిసార్లు ఈ వ్యూహం కూడా దెబ్బతిన్నది. టీఆర్ఎస్ తన రాజకీయ ప్రస్థానంలో చాలా సార్లు చీలికలకు గురైంది. ఒకానొక దశలో పార్టీ మనుగడే ప్రశ్నార్థంగా మారే పరిస్థితిని ఎదుర్కొంది.

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అకాలమృతి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంఘటనలు టీఆర్ఎస్‌కు కలసివచ్చాయి. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో తేలిపోవాలంటూ 2009 నవంబర్‌ 29న కేసీఆర్ ఆమరణ నిరహార దీక్షకు దిగారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఇది కీలకమలుపు. కేసీఆర్ దీక్షతో తెలంగాణలో ఉద్యమం ఉధృతం అయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది.

2009 డిసెంబర్‌ 9న అప్పటి హోంమంత్రి చిదంబరం.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. కానీ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో డిసెంబర్ 23న యూపీఎ ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుంది. దీంతో తెలంగాణలో ఉద్యమం మరింత ఉధృతమైంది. త్యాగాల కొలిమిగా తెలంగాణ మారింది.

ఈ దశలో టీఆర్ఎస్ మిగిలిన పార్టీలతో కలిసి తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉద్యమాన్ని నడిపించింది. మిలియన్ మార్చ్, వంటా వార్పు, సాగరహారం తదితర ఉద్యమాల్లో ముందుండి నడిచింది. ఉద్యమ వేడీ ఎక్కడా తగ్గకుండా చూశారు. దీంతో ఎట్టకేలకు యూపీఎ తెలంగాణ ఇవ్వడానికి ఒప్పుకుంది. తెలంగాణ ఏర్పాటు బిల్లు లోక్‌సభలో 2014 ఫిబ్రవరి 18న, రాజ్యసభలో ఫిబ్రవరి 20న ఆమోదం పొందింది.

రాష్ట్రపతి మార్చి 1న తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపారు. గెజిట్‌లో 2014 జూన్‌ 2 అపాయింటెడ్‌ డే గా పేర్కొన్నారు. దీంతో జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ ప్రజల దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసింది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించిన 2001 ఏప్రిల్‌ 27 నుంచి ప్రారంభమైన తెలంగాణ ఉద్యమ చరిత్ర అంతా టీఆర్‌ఎస్‌ చరిత్రేననేది ఇప్పుడు గులాబీ శ్రేణులు గర్వంగా చెప్పే మాట.

Tags

Read MoreRead Less
Next Story