Medaram Jathara: మేడారం జాతరకు ఘనంగా ఏర్పాట్లు

Medaram Jathara: మేడారం జాతరకు ఘనంగా ఏర్పాట్లు
2200 సిటీ బస్సులు,బెల్లం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ ఆంక్షలు

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం TSRTC పకడ్బందీ ఏర్పాట్లను చేస్తోంది. భక్తులను తరలించేందుకు 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.

ములుగు జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగనుంది. మేడారంలో 55 ఎకరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్, బేస్ క్యాంప్, 48 క్యూ రెయిలింగ్స్‌ను మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌ పరిశీలించారు. జాతరను TSRTC ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. జాతరకు TSRTC స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ రూం , సీసీ టీవీ కెమెరాలు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. బస్సులు మార్గమధ్యలో ఎక్కడా ఆగకుండా 25 ఛేజింగ్ స్కాడ్ టీమ్‌లను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. రెండేళ్లకోసారి వచ్చే మేడారం మహాజాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. జాతరకు పది రోజుల ముందే అన్ని అభివృద్ధి పనులు పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. సమ్మక్క-సారలమ్మ జాతరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉన్నందున ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 14.50 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా బంగారం (బెల్లం) అమ్మకాలకు సంబంధించి అధికారులు ఆంక్షలు పెట్టారు. బెల్లం కొనుగోలు చేసేవారి ఆధార్ జిరాక్స్ కాపీ, మొబైల్ నెంబర్ తీసుకోవాలని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. మేడారంతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరలో అమ్మవార్లకు భక్తులు పెద్ద ఎత్తున బెల్లం సమర్పించుకుంటారు. నిలువెత్తు బెల్లం అమ్మవార్లకు ముడుపు చెల్లిస్తుంటారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా బెల్లం అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి. రెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ జాతర కోసం వ్యాపారులు పెద్ద మొత్తంలో బెల్లం స్టాక్ తెప్పించుకుంటారు.

ఈ ఏడాది జాతర సందర్భంగా బెల్లం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ ఆంక్షలు పెట్టడంతో అటు వ్యాపారులు, ఇటు భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఆధార్ తప్పనిసరి నిబంధనను తొలగించాలని కోరుతున్నారు. అయితే, గుడుంబా తయారీని కట్టడి చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో బెల్లం కొనుగోలు చేసి గుడుంబా తయారీకి వినియోగించే అవకాశం ఉందని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story