TS: కాంగ్రెస్‌ ఎంపీ సీటు కోసం భారీగా దరఖాస్తులు

TS: కాంగ్రెస్‌ ఎంపీ సీటు కోసం భారీగా దరఖాస్తులు
కాంగ్రెస్‌ తరపున టికెట్‌ కోసం భారీగా దరఖాస్తులు.... 17 లోక్‌సభ స్థానాలకు 306 అప్లికేషన్స్‌...

తెలంగాణలో కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల బరిలో దిగేందుకు పెద్దసంఖ్యలో నాయకులు టికెట్ల కోసం పోటీపడుతున్నారు. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ కోసం 306 మంది దరఖాస్తు చేయగా..... ఒక్కో నియోజకవర్గానికి సగటున 18 మంది నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌కి చెందిన వారే కాకుండా వివిధ రంగాల్లో పనిచేస్తున్న అధికారులు ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో అధికారం ఉన్నందున గెలుపు తధ్యమని భావిస్తున్న నాయకులు టికెట్ కోసం పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ నాయకత్వం... ప్రతి లోక్‌సభ స్థానాన్ని అత్యంత ప్రాముఖ్యమైందిగా భావిస్తుడంటంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో రాజీపడకుండా ముందుకువెళ్లాలని నిర్ణయించింది. అందులో భాగంగా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగాలని ఆత్రుతగా ఉన్న నాయకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.


జనవరి 31నుంచి ఈనెల3వరకు దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ నాయకత్వం అవకాశం కల్పించింది. తొలిరోజు ఆశించిన స్థాయిలో స్పందన లేకపోగా... ఆ తర్వాత రోజురోజుకు సంఖ్య పెరుగుతూ వచ్చింది. బుధవారం 7, గురువారం 34, శుక్రవారం రోజు దాదాపు 100 దరఖాస్తులు వచ్చాయి. శనివారం చివరిరోజు కావడంతో ఏకంగా 166 దరఖాస్తులు వచ్చాయి. 17 నియోజకవర్గాలకు 306 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంటే ఒక్కో నియోజకవర్గానికి సగటున 18 మంది టికెట్ కోసం పోటీ పడుతున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు విహనుమంతరావు ఖమ్మం నుంచి పోటీకి దరఖాస్తుచేశారు. ఖమ్మం నుంచి టికెట్ ఆశిస్తున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి నందిని గాంధీభవన్‌కు వచ్చి దరఖాస్తు అందించారు. మంత్రిపొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి సైతం ఖమ్మం నుంచి పోటీకి ఆసక్తితో ఉన్నారు. ఖమ్మం నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి అనుచరులతో కలిసి దరఖాస్తు అందజేయించారు. నల్గొండనుంచి పోటీకిపటేల్ రమేష్ రెడ్డితో పాటు జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి దరఖాస్తు అందించారు.


భువనగిరి నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి కుమారుడు డాక్టర్ సూర్యపవన్ రెడ్డి, బండ్రు శోభారాణి, సికింద్రాబాద్ నుంచి కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, డాక్టర్ వేణుగోపాలస్వామి, అనిల్ కుమార్‌యాదవ్ టికెట్లు ఆశిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ఎంపీస్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని భట్టి నందిని ఆశాభావం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ నుంచి పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి , పీసీసీ ప్రధాన కార్యదర్శి చారకొండ వెంకటేశ్‌ టికెట్‌ఆశిస్తున్నారు. మహబూబ్‌నగర్ నుంచి ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి, సీతాదయాకర్‌రెడ్డి ఆశిస్తున్న వారిలో ఉన్నారు. చేవెళ్ల నుంచి బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, మల్‌రెడ్డి రామిరెడ్డి తదితరులు దరఖాస్తు చేశారు. మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఖమ్మం, సికింద్రాబాద్ టికెట్లు ఆశిస్తూ గాంధీభవన్‌లో దరఖాస్తుచేశారు.

Tags

Read MoreRead Less
Next Story