TS: వంద కోట్ల అక్రమాస్తులు

TS: వంద కోట్ల అక్రమాస్తులు
రెరా కార్యదర్శి బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు.... ఖరీదైన చేతి గడియారాలు, ఆస్తి పత్రాలు స్వాధీనం

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ-ACB భారీ అవినీతిని వెలికి తీసింది. HMDA టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరక్టర్, తెలంగాణ రియల్ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ-రెరా కార్యదర్శి ఎస్.బాలకృష్ణపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ACB.... బుధవారం తెల్లవారుజాము నుంచి 14 బృందాలతో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడలోని ఆదిత్య పోర్ట్వ్యూ విల్లాలోని బాలకృష్ణ నివాసంతోపాటు... ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో నిన్న అర్థరాత్రి వరకు తనిఖీలు చేశారు. పెద్దమొత్తంలో ఆస్తులపత్రాల్ని, రిజిస్ట్రేషన్ దస్తావేజుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


ఇంట్లోని బీరువాల్లో 500రూపాయలు, 200 రూపాయల నోట్ల కట్టలు పెద్దఎత్తున లభ్యమయ్యాయి. వాటిని లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్లు తీసుకు రావాల్సి వచ్చింది. బుధవారం రాత్రి వరకు లెక్కించిన నగదును 40లక్షలు రూపాయలుగా గుర్తించారు. అవినీతి నిరోధక శాఖ అంచనా ప్రకారం బాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల విలువ.... బహిరంగ మార్కెట్‌లో 100కోట్ల వరకు ఉంటుందని నిర్ధరించారు. సోదాలు మొత్తం పూర్తయితే ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. బాలకృష్ణ ఆస్తులకు సంబంధించి కొద్దిరోజుల క్రితమే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదులోని సమాచారం ఆధారంగా పలు ఆస్తుల దస్తావేజుల్ని సంపాదించిన అనిశా అధికారులు బుధవారం తెల్లవారుజామునే పలుచోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు.


బాలకృష్ణతోపాటు కుటుంబసభ్యులు సోదాలకు సహకరించపోవడంతో... గంటల తరబడి జప్తు ప్రక్రియ కొనసాగింది. వారి పేరిట పలు బ్యాంకుల్లో లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని తెరిస్తే మరిన్ని ఆస్తులు బహిర్గతమవుతాయని భావిస్తున్నారు. అలాగే బాలకృష్ణ తన అక్రమ సంపాదనతో బినామీల పేరిట ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఏసీబీ సమాచారం సేకరించింది. వారిని ఇప్పటికే విచారించి కీలక వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఆ సమాచారం ఆధారంగా బాలకృష్ణపై బినామీ చట్టం ప్రయోగించే యోచనతో ఉన్నారు. ఇవాళ కూడా సోదాలు కొనసాగే అవకాశముంది. సోదాల అనంతరం బాలకృష్ణను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.


ప్రస్తుతం రెరా కార్యదర్శిగా ఉన్న బాలకృష్ణ అక్రమ సంపాదన అంతా... హెచ్ఎండీఏ కేంద్రంగానే సాగినట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి HMDAలో తిష్ఠ కోట్లు కొల్లగొట్టారు. ఓవైపు HMDA ప్రణాళిక విభాగం డైరెక్టర్‌గా ఉంటూనే.. మరోవైపు M.A.U.Dలో ఇంఛార్జి డైరెక్టర్‌గానూ కొనసాగారు. హెచ్ఎండీఏ నుంచి దస్త్రాలను ఆయనే పంపించేవారు. M.A.U.D డైరెక్టర్ హోదాలో వాటికి ఆయనే జీవోలిచ్చేవారు. రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, భువనగిరి, సంగారెడ్డి సహా ఏడు జిల్లాల్లోని భూములకు సంబందించిన అనుమతుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story