ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్

ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్
అవినీతి అధికారుల లంచాల దాహం లక్షల్ని దాటి కోట్లల్లోకి వెళ్లింది. మెదక్ అడిషనల్‌ కలెక్టర్ నగేష్ ఒక కోటి 12 లక్షలు..

అవినీతి అధికారుల లంచాల దాహం లక్షల్ని దాటి కోట్లల్లోకి వెళ్లింది. మెదక్ అడిషనల్‌ కలెక్టర్ నగేష్ ఒక కోటి 12 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరకడం సంచలనంగా మారింది. నర్సాపూర్ మండలం తిప్పల్‌తుర్తికి చెందిన 112 ఎకరాల భూమికి ఎన్వోసీ కోసం అడిషనల్‌ కలెక్టర్‌ నగేష్ లంచం డిమాండ్ చేశారు. 112 ఎకరాలకు గాను ఎకరానికి లక్ష చొప్పున కోటి 12 లక్షలు లంచానికి డీల్ కుదుర్చుకున్నారు. ఇందులో 40 లక్షలు ఇప్పటికే తీసుకున్నారు. అడిషనల్ కలెక్టర్ లంచం వ్యవహారంపై పక్కాగా ఆడియో ఆధారాలు కూడా ఉన్నాయి. లంచం డబ్బులు పూర్తిగా ఇస్తారో లేదోననే కారణంగా ఇందుకు సంబంధించి ఆయన అగ్రిమెంట్ కూడా చేయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మెదక్ జిల్లాకు కలెక్టర్ లేకపోవడంతో అడిషనల్ కలెక్టర్‌గా ఉన్న నగేషే ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే అవినీతి బాగోతం బయటపడడం చర్చనీయాంశమైంది. అటు, కొంపల్లిలో అడిషనల్ కలెక్టర్‌ నగేష్‌కి ఫామ్‌హౌస్ ఉన్నట్టు సమాచారం రావడంతో అక్కడికి కూడా ఓ బృందాన్ని పంపినట్టు తెలుస్తోంది.

మాచవరంలోని నగేష్‌ నివాసంతో పాటు ఏకకాలంలో 12 చోట్ల ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇదే కేసులో నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి, తహశీల్దార్ మాలతి ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. అడిషనల్ కలెక్టర్ నగేష్‌ భార్యను బోయిన్‌పల్లి తీసుకెళ్లి అక్కడి బ్యాంక్‌లో ఉన్న లాకర్ తెరిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గచ్చిబౌలికి చెందిన మూర్తి అనే వ్యక్తి ఫిర్యాదుతో మెదక్‌ అడిషనల్ కలెక్టర్ ఇంట్లో సోదాలు చేపట్టారు. ప్రస్తుతం నగేష్‌ ఇంట్లో 1 లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమికంగా తమకు అన్ని ఆధారాలు లభించాయని ACB డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.

మెదక్ కలెక్టరేట్‌లో కూడా ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం NOC కోసం అప్లై చేసిన భూమికి సంబంధించిన రికార్డులన్నీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కొందరు రెవెన్యూ అధికారుల పాత్రపైనా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయంటున్న ACB టీమ్.. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అన్నీ బయటపెడతామంటున్నారు.

ఈ మధ్య కాలంలో రెవెన్యూ శాఖపై ఏసీబీ నిఘా పెట్టింది. తాజాగా బయటపడ్డ నర్సాపూర్ భూవివాదంలో అడిషనల్ కలెక్టర్ నుంచి MRO, VRO, VRA వరకూ అంతా చేతివాటం ప్రదర్శించారు. మొత్తం 12 మంది ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. గత 6 నెలల్లో లంచం తీసుకుంటూ 40 మంది రెవెన్యూ సిబ్బంది ACBకి చిక్కారు. వీళ్లపై కేసులు కూడా నమోదయ్యాయి. రెవెన్యూ చట్టంలో సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సమయంలోనే ఎక్కడిక్కడ అవినీతి అధికారులు దొరుకుతుండడం సంచలనంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story