ACB: చేతి గడియారాలే రూ.33 లక్షలు

ACB: చేతి గడియారాలే రూ.33 లక్షలు
కళ్లు బైర్లు కమ్మేలా ఆస్తులు కూడబెట్టిన శివబాలకృష్ణ... రిమాండ్‌ రిపోర్టులో ఏసీబీ

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి పర్వాన్ని రిమాండ్‌ రిపోర్ట్‌ ACB వివరించింది. GHMC, HMDAలో ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తూ అక్రమంగా సుమారు 100కోట్ల మేర ఆస్తులు కూడబెట్టినట్లు లెక్కగట్టింది. బినామీల పేరిట వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు అనిశా అధికారులు అనుమానిస్తున్నారు. కళ్లు చెదిరే రీతిలో ఆస్తులు కూడగట్టిన HMDA మాజీ డైరెక్టర్, మెట్రో రైల్ ప్లానింగ్ అధికారి శివబాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో ACB అధికారులు కీలక విషయాలను ప్రస్తావించారు. రెండు రోజులపాటు బృందాలుగా విడిపోయి మొత్తం 18చోట్ల సోదాలు చేసినట్లు తెలిపారు. సోదాల సమయంలో చర, స్థిరాస్తులు గుర్తించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. బాలకృష్ణ పేరుపై సోమాజిగూడలోని తులిప్స్ అపార్ట్‌మెంట్‌లో ప్లాట్, భార్య రఘుదేవి పేరిట ఘట్‌కేసర్ చందుపట్లగూడలో 300గజాల స్థలం, కుమార్తె పేరిట నాగర్‌కర్నూల్‌లో 18లక్షలు విలువ చేసే వ్యవసాయ భూమి, చేవెళ్ల కందువాడలో 10గుంటల స్థలం, అతని కుమారుడు హరిప్రసాద్ పేరిట చేవెళ్ళలో 10గుంటల స్థలాన్ని గుర్తించారు.


సోదరుడు నవీన్ కుమార్ పేరిట పుప్పలగూడలో ఓ విల్లా, సోదరి పేరిట శేర్‌లింగంపల్లిలో ఒక ఫ్లాట్‌ను గుర్తించారు. వీటి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 2 కోట్ల 57లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. బహిరంగ మార్కెట్‌ విలువ సుమారు 40కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ పేర్కొంది. సోదాలు చేసిన సమయంలో ఏసీబీ ఆస్తుల వివరాలు అడగగా... అవి తమ పేరుపై ఉన్నట్లుగా తమకు తెలిదని సమాధానం ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. సోదాల సమయంలో ఇంట్లో లభించిన 120చేతి గడియారాల విలువే సుమారు 33లక్షలు ఉంటుందని రిమాండ్ రిపోర్ట్‌లో అధికారులు వెల్లడించారు. సోదాల్లో భాగంగా శివ బాలకృష్ణ ఇంట్లో 155 సేల్‌ డీడ్ డాక్యుమెంట్లు, నాలుగు పాసు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. 51లక్షల విలువ చేసే నాలుగు కార్లు సైతం స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.

సిద్దిపేట జిల్లా అల్లీపురానికి చెందిన నిందితుడు శివబాలకృష్ణ.. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్‌లో మాస్టర్ డిగ్రీ చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు హోదాల్లో పనిచేసిన శివబాలకృష్ణ 2021 నుంచి 2023 వరకూ HMDA ప్లానింగ్ డైరెక్టర్‌గా పని చేశాడు. 2023 జూలై నుంచి మెట్రోరైల్ ప్లానింగ్ అధికారిగా పని చేస్తున్నాడు. అతని సర్వీసులో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ వెల్లడించింది. HMDAలో పనిచేసిన సమయంలో కొన్ని ప్రముఖ ఇన్‌ఫ్రా కంపెనీలకు అనుమతులు మంజూరు చేసి కోట్లు గడించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కొంత డబ్బును ఇన్‌ఫ్రా కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. బినామీ పేర్లపై ఆస్తులను కూడబెట్టారని తెలుసుకున్న అధికారులు... ఇప్పటివరకూ అతని స్నేహితులు, బంధువులు సహా 34మందిపై ఉన్న ఆస్తుల వివరాలు రిమాండ్ రిపోర్ట్‌లో పొందుపరిచారు. వీటన్నంటిని పరిశీలించి బినామి ఆస్తులు అని తేలితే జప్తు చేసే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story