ఫేక్ న్యూస్‌తో మానసికంగా వేధిస్తున్నారు.. సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన నటి

ఫేక్ న్యూస్‌తో మానసికంగా వేధిస్తున్నారు.. సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన నటి
తన ఫొటో మార్ఫింగ్ చేసి, కావాలనే తన ఇమేజ్ దెబ్బతీసేలా వ్యవహరిస్తూ తప్పుడు పోస్ట్ షేర్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ గచ్చిబౌలి వెళ్లి సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ని కలిసారు.

ఫేస్‌బుక్‌లో తనను టార్గెట్ చేసుకుని క్రియేట్ చేసిన ఫేక్ న్యూస్‌పై సినీనటి, బీజేపీ నేత మాధవీలత మండిపడ్డారు. తన ఫొటో మార్ఫింగ్ చేసి, కావాలనే తన ఇమేజ్ దెబ్బతీసేలా వ్యవహరిస్తూ తప్పుడు పోస్ట్ షేర్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ గచ్చిబౌలి వెళ్లి సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ని కలిసారు. ఎవరు ఈ తప్పుడు పోస్టులు క్రియేట్ చేస్తోంది, ఎవరు వీటిని షేర్ చేస్తోందీ గుర్తించి వాళ్లను కఠినంగా శిక్షించాలని కోరారు. విజయ్ మహరాజ్ అనే వ్యక్తితోపాటు మరికొందరిపై ఫిర్యాదు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఆలయాలపై వరుస దాడులు జరిగాయి. ఈ తరహా విధ్వంసాన్ని ఖండిస్తూ మాట్లాడినందుకే ఓ వర్గం తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిందని మాధవీలత అనుమానిస్తున్నారు. ఎక్కడో ఎవరో అమ్మాయిలు పట్టుబడితే అందులో తాను ఉన్నట్టు చెప్పి తన పరువు తీసేలా తప్పుడు పోస్టులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వర్గం తనను టార్గెట్ చేసి కక్షపూరితంగా పోస్టులు పెడుతోందన్నారామె. ఏపీలో అధికారపార్టీకి చెందిన వారితోపాటు తెలంగాణలోనూ కొందరు తనపై వ్యక్తిగతంగా చీప్‌ విమర్శలు చేస్తున్నారన్నారు.

మామూలు ఆడపిల్లే కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు.. అమ్మాయిల క్యారెక్టర్ కించపరిచేలా పోస్టులు పెట్టే వాళ్లను ఏం చేయాలి? ఇలాంటి సైబర్ అటాక్స్‌ను మౌనంగా ఎందుకు భరించాలి.? ఇదే ప్రశ్న వేస్తున్నారు మాధవీలత. ఒక సెలబ్రిటీగా మాధవీలత చాలా గాసిప్స్ చూసే ఉంటారు. కానీ తనపై ఈ తరహాలో క్యారెక్టర్‌ను దెబ్బతీసేలా వచ్చిన వార్తను చూసి తట్టుకోలేకపోయారు.

సినిమాకు సంబంధించిన అంశాలతోపాటు, సామాజిక అంశాలపైన తరచుగా లైవ్ డిబేట్లలో కూడా పాల్గొనే ఆమె.. ఈ అరాచకాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ఆలయాలపై దాడుల్ని ప్రశ్నించినందుకు తానను టార్గెట్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటున్నారామె. ఎవరు ఎంతలా వేధింపులకు పాల్పడినా హిందూ ధర్మం కోసం తాను పోరాడుతూనే ఉంటానని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story