Telangana: ఉగ్రవాదులకు ఆదిలాబాదే సేఫ్‌ జోన్‌.. సంచలన విషయాలు బయటపెట్టిన ఆ నలుగురు..

Telangana: ఉగ్రవాదులకు ఆదిలాబాదే సేఫ్‌ జోన్‌.. సంచలన విషయాలు బయటపెట్టిన ఆ నలుగురు..
Telangana: టెర్రరిస్టులకు ఆదిలాబాద్‌ సేఫ్‌ జోన్‌ అనే విషయం మరోసారి బయటపడింది.

Telangana: టెర్రరిస్టులకు ఆదిలాబాద్‌ సేఫ్‌ జోన్‌ అనే విషయం మరోసారి బయటపడింది. ఎన్‌ఐఏ అధికారులు సంచలన విషయాలు బయటపెట్టారు. ఆదిలాబాద్‌కు పాకిస్తాన్‌ నుంచి ఆయుధాలు సప్లై అవుతుంటే.. హర్యానా పోలీసులు పట్టుకున్నారు. హమ్మయ్య.. ముందుగానే పట్టేసుకున్నారు అని ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి మారణాయుధాలు, పేలుడు పదార్ధాలు అంతకు నెల రోజుల ముందే తెలంగాణలోని జహీరాబాద్‌కు చేరిపోయాయంటూ షాకింగ్‌ విషయాలు బయటపెట్టారు.

హర్యానాలో పట్టుబడిన నలుగురు ఖలిస్తానీ తీవ్రవాదులను పలు విధాలుగా ప్రశ్నిస్తే.. కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. మే 5వ తేదీన హర్యానాలో పట్టుబడినవి కొన్నేనని.. నిజానికి మార్చి 30వ తేదీనే ఐఈడీ, ఇతర మారణాయుధాలను సేఫ్‌గా జహీరాబాద్‌కు చేర్చామని తీవ్రవాదులు ఒప్పుకున్నారు. హర్యానాలోని కర్నాల్‌లో గురుప్రీత్‌సింగ్, అమన్‌దీప్‌, పర్మీందర్‌ సింగ్, భూపీందర్ అనే నలుగురు ఖలిస్తానీ టెర్రరిస్టులు మే 5న పట్టుబడ్డారు.

వీరి నుంచి IED పేలుడు పదార్ధాలు, పిస్తోల్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాది హ‌ర్వింద్ సింగ్ రిండా ఆదేశాల ప్రకారం ఈ న‌లుగురు పేలుడు ప‌దార్థాలు స‌ర‌ఫ‌రా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అప్పటి నుంచి ఎన్‌ఐఏ వీరిని ప్రశ్నిస్తోంది. అయితే, ఖలీస్తానీ గ్యాంగ్‌కు చెందిన కొందరు తమకంటే ముందే కొన్ని పేలుడు పదార్ధాలను తెలంగాణకు తరలించారని చెప్పుకొచ్చారు.

ఫిరోజ్‌పూర్‌కు చెందిన ఆకాశ్‌దీప్‌ సింగ్, జషన్‌పప్రీత్‌ సింగ్.. మార్చి 30, ఏప్రిల్ ఒకటి తేదీల్లో IED పేలుడు పదార్ధాలను జహీరాబాద్‌లోని హైదరాబాద్‌-జహీరాబాద్‌ హైవే దగ్గర్లో డెలివరీ చేశారనే విషయం బయటపెట్టారు. అయితే, జహీరాబాద్‌లో ఎక్కడ డెలివరీ చేశారనేదే అంతుబట్టడం లేదు. చివరి నిమిషం వరకు పేలుడు పదార్ధాలను దాచే చోటును మారుస్తూ, సీక్రెట్‌గా ఉంచుతున్న కారణంగా.. ఆ ప్లేస్ ఎక్కడనేది చెప్పలేకపోతున్నారు.

దీంతో నిందితులను తెలంగాణకు తీసుకొచ్చి, ఆయుధాలను ఎక్కడ చేర్చారో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. తాజా పరిణామాలతో దేశంలో ఖలిస్తానీ ఉగ్రవాదం మళ్లీ పురుడుపోసుకుంటోందన్న చర్చ జరుగుతోంది. పంజాబ్‌ వేర్పాటు వాదానికి పాకిస్తాన్‌ అండగా ఉంటోంది. ఇప్పుడు పట్టుబడిన ఆయుధాలు కూడా పాకిస్తాన్‌ నుంచి వచ్చినవే. పాకిస్తాన్‌ నుంచి ఆదిలాబాద్‌కు సరఫరా అవుతున్న మారణాయుధాలను హర్యానా పోలీసులు పట్టుకోవడం సంచలనం సృష్టించింది.

పట్టుబడ్డ యువకుల్లో ఒకరికి ఖలిస్తానీ ఉగ్రవాది అయిన బబ్బర్‌ ఖాల్సాకు సంబంధాలున్నట్లు తేలడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఇతర ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన ఖలిస్తానీ ఉగ్రవాదం.. తెలంగాణ, మహారాష్ట్రను టార్గెట్‌ చేయడంతో కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఖలిస్తానీ ఉగ్రవాదులను పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఉగ్రవాదులు అడ్డంపెట్టుకుని, భారత్‌లో అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story