తెలంగాణలో మరో అడ్వకేట్‌పై హత్యాయత్నం?

తెలంగాణలో మరో అడ్వకేట్‌పై హత్యాయత్నం?

వామనరావు దంపతుల హత్య తరువాత న్యాయవాదులలో భయాలు ఎంతలా పెరిగిపోయాయి అనే దానికి ఉదాహరణే ఈ సంఘటన. వరంగల్‌లో కేసు వాదించడానికి హైదరాబాద్‌ నుంచి వెళ్తున్న హైకోర్టు న్యాయవాదులకు యాక్సిడెంట్ జరిగింది. అయితే, ఈ యాక్సిడెంట్ కేవలం అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదంటున్నారు అడ్వకేట్ దుర్గా ప్రసాద్.

హైదరాబాద్‌కు వెళ్తుండగా జనగామ దగ్గర్లోని యశ్వంత్‌పూర్‌ బైపాస్ వై-జంక్షన్ వద్ద అడ్వకేట్ల కారును లారీ ఢీకొట్టింది. బల్లార్ష నుంచి కార్బన్‌ లోడుతో వస్తున్న లారీ.. వేగంగా వచ్చి లాయర్ల కారును ఢీకొట్టింది. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే లారీ ఆగలేదు. కొద్దిదూరం వరకు కారును అలాగే లాక్కెళ్లింది. ఇదంతా చూస్తుంటే.. వామనరావు దంపతుల హత్యే గుర్తొస్తోందన్నారు న్యాయవాది దుర్గాప్రసాద్.

అయితే, లారీ డ్రైవర్ వర్షన్ మరోలా ఉంది. కారును ఢీకొట్టిన తరువాత బ్రేక్‌ వేయడానికి ప్రయత్నించామని.. కాని, బ్రేకులు ఫెయిల్ అవడంతో కొద్దిదూరం వెళ్లి ఆగిందని చెప్పుకొచ్చారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లారీ డ్రైవర్‌ హీరాసింగ్‌పై కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో హైకోర్టు అడ్వకేట్ దుర్గాప్రసాద్‌తో పాటు జూనియర్ అడ్వకేట్ కృష్ణమూర్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు జనగామ సీఐ మల్లేశ్ తెలిపారు.

లాయర్ దుర్గాప్రసాద్ కొన్ని భూతగాదా కేసులను వాదిస్తున్నారు. కక్షిదారులు ఎవరైనా తమపై హత్యాప్రయత్నం చేయించారేమోనని దుర్గాప్రసాద్‌ అనుమానం వ్యక్తం చేశారు. కారును లారీ కొద్దిదూరం అలాగే లాక్కెళ్లడం చూస్తుంటే అదే భావన కలుగుతుందన్నారు. మంథనిలో న్యాయవాదుల జంట హత్య జరిగిన నేపథ్యంలో తమకూ అలాంటి అనుమానమే కలుగుతోందని చెప్పారు. వరంగల్‌కు వెళ్తున్నది కూడా వంద కోట్ల విలువైన లాండ్ ప్రాపర్టీ కేసు గురించేనని చెప్పుకొచ్చారు అడ్వకేట్ దుర్గాప్రసాద్.

Tags

Read MoreRead Less
Next Story