Congress : దూకుడు పెంచిన కాంగ్రెస్

Congress : దూకుడు పెంచిన కాంగ్రెస్
లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్

తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌పార్టీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌... పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా దూకుడు పెంచాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రకటించిన ఆరు గ్యారంటీలను నిర్దేశిత గడువులో అమలు చేయడం, నెల రోజుల్లో నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేయడం ద్వారా పార్టీ పరంగా బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో బలోపేతం చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని అంచనా వేస్తోంది. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో పార్లమెంటు ఎన్నికలే ప్రధాన ఎజెండాగా నాయకులు సమాలోచనలు చేశారు. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలలో.... బలహీనంగా ఉన్న దగ్గర ఏవిధంగా ముందుకు వెళ్లాలో చర్చించారు. భారాస, భాజపాలను ఏవిధంగా ఎదుర్కోవాలనే యోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ నగరంలో.... ఒక్క అసెంబ్లీ సీటు కూడా రాని పరిస్థితిలో.... ఇక్కడ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే చర్చ జరిగింది. రాష్ట్ర రాజధానిలో పార్టీకి పట్టు లేకుంటే... రాబోయే GHMC ఎన్నికల్లో కూడా వెనుకబడే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించేందుకు సమాయత్తం అవుతోంది.

పార్లమెంట్ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా సాగిన కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ...17 నియోజకవర్గాలకు మంత్రులను, సీనియర్ నాయకులను ఇంఛార్జీలుగా నియమించారు. ఆదిలాబాద్- సీతక్క, పెద్దపల్లి - శ్రీధర్ బాబు, కరీంనగర్- పొన్నం ప్రభాకర్, నిజామాబాద్- జీవన్ రెడ్డి, జహీరాబాద్ - సుదర్శన్ రెడ్డి, మెదక్ - దామోదర రాజనర్సింహ, మల్కాజ్‌గిరి- తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్, హైదరాబాద్‌లకు భట్టి‌‌విక్రమార్క, చేవెళ్ల, మహబూబ్ నగర్‌లకు రేవంత్ రెడ్డి, నాగర్ కర్నూల్ - జూపల్లి కృష్ణారావు, నల్గొండ - ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి - కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ - కొండా సురేఖ, మహబూబాబాద్, ఖమ్మంలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను ఇంఛార్జీలుగా నియమించింది. మరోవైపు నామినేటెడ్ పదవుల భర్తీని నెలరోజుల్లో పూర్తి చేయాలని AICC ఇప్పటికే మంత్రులకు సూచించింది..

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీలను నిర్దేశిత వంద రోజుల్లో అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం ఉన్నప్పటికీ అమలు విషయంలో ఏ మాత్రం రాజీ పడకూడదని నిర్ణయించింది. ఈ పథకాలను పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూరేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story