Bandi sanjay : కేసీఆర్‌కు గ్రామ పంచాయతీలంటే ఏ మాత్రం గౌరవం లేదు : బండి సంజయ్‌

Bandi sanjay : కేసీఆర్‌కు గ్రామ పంచాయతీలంటే ఏ మాత్రం గౌరవం లేదు : బండి సంజయ్‌
Bandi sanjay : గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులివ్వడాన్ని సీఎం కేసీఆర్ చిల్లర వ్యవహారంగా పేర్కొంటూ తప్పుపట్టడం అత్యంత దురదృష్టకరమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.

Bandi sanjay : గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులివ్వడాన్ని సీఎం కేసీఆర్ చిల్లర వ్యవహారంగా పేర్కొంటూ తప్పుపట్టడం అత్యంత దురదృష్టకరమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. నిధులు, విధులను నేరుగా గ్రామ పంచాయతీలకు బదలాయించాలన్నదే 73వ రాజ్యాంగ సవరణ ముఖ్య ఉద్దేశమన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి మేరకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులిస్తూ లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుస్తోందని తెలిపారు.

విద్య, వైద్యం సహా 29 అంశాలను గ్రామాలకే బదలాయించాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నా.. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ గ్రామ పంచాయతీల అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్లు సహా వివిధ పథకాలకు సంబంధించి లబ్దిదారుల ఎంపిక గ్రామ సభల ద్వారానే జరగాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందన్నారు. వాటిపై ఎమ్మెల్యేలకు పెత్తనమిచ్చి గ్రామ పంచాయతీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన కేసీఆర్‌ది చిల్లర బుద్ది కాక ఏమనాలన్నారు.

గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను కమిషన్ల కోసం కక్కుర్తిపడి పక్కదారి పట్టిస్తూ గ్రామాలను పూర్తిగా నీరుగారుస్తున్నది కేసీఆర్ కాదా? అని అన్నారు. కమిషన్ల కోసం ట్రాక్టర్లు కొంటున్నది.. కేంద్ర నిధులను జీతాలకు మళ్లిస్తోంది నిజం కాదా? అని నిలదీశారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నది నిజం కాదా? కేసీఆర్ చేతగానితనం వల్ల సర్పంచులు ఉన్న ఆస్తులను అమ్ముకుని అప్పులపాలై ఉపాధి కూలీలుగా, వాచ్ మెన్లుగా, సెక్యూరిటీ ఉద్యోగులుగా కాలం వెళ్లదీస్తున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులివ్వకుండా ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్నది కేసీఆర్ కాదా? అని అన్నారు. తండాలను పంచాయతీలుగా మార్చి నిధులివ్వకుండా తండాలను నిర్వీర్యం చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? అని అన్నారు బండి సంజయ్‌. కేసీఆర్ అవినీతిని, గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులపై నిలదీస్తున్న సర్పంచులపై అక్రమంగా కేసులు పెట్టి సస్పెండ్ చేస్తున్న మాట నిజం కాదా? కేసీఆర్ కుటుంబ అవినీతికి మడుగులొత్తే ప్రజా ప్రతినిధులను అందలమెక్కిస్తూ.. ఇతర పార్టీల సర్పంచులు-ఉప సర్పంచుల మధ్య కొట్లాటి పెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు యత్నిస్తున్న విషయం వాస్తవం కాదా? అని అన్నారు. గ్రామ పంచాయతీలంటే ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తి కేసీఆర్ అని బండి సంజయ్‌ విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story