కొనసాగుతోన్న బండి సంజయ్‌ నిరసన దీక్ష

కొనసాగుతోన్న బండి సంజయ్‌ నిరసన దీక్ష

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నిరసన దీక్ష కొనసాగుతోంది. దుబ్బాక వెళ్తున్న తనపై సిద్దిపేట పోలీసు కమిషనర్‌ దౌర్జన్యం చేసి చేయి చేసుకున్నారని, ఆయన్ని బదిలీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎంపీ బండి సంజయ్‌ చేపట్టిన దీక్షతో పరిస్థితులు ఇంకాస్థ ఉద్రిక్తంగా మారింది. సీపీని బదిలీ చేసి కేసు నమోదు చేసేవరకు తాను దీక్ష విరిమించేదే లేదు అంటున్నారు.

ఉదయం నుంచే బీజేపీ కీలక నేతలు, కార్యకర్తలు అంతా బండి సంజయ్‌ దీక్ష చేస్తున్న ప్రదేశానికి చేరుకొనే ప్రయత్నం చేయడం.. అదే సమయంలో బీజేపీ నేతల హౌస్‌ అరెస్టులతో పరిస్థితి రణరంగంగా మారింది.. నిన్నటి నుంచి జరుగుతున్న ఇష్యూలో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. ఎక్కడికక్కడ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేపీ నేతలు, కార్యకర్తలు.. కొన్ని చోట్ల సీఎం కేసీఆర్‌ దిష్టి బొమ్మలు సైతం దహనం చేశారు.. మరోవైపు పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉధ్రిక్తంగా మారింది..

దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ గెలవకపోతే సస్పెండ్‌ చేస్తాం, బదిలీ చేస్తామని అధికార పార్టీ నేతలు స్థానిక అధికారులను బెదిరిస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. ఏదోరకంగా శాంతి భద్రతల సమస్య సృష్టించి దుబ్బాక ఉప ఎన్నికను వాయిదా వేయాలని టీఆర్‌ఎస్‌ కుట్రపన్నుతోందన్నారు. అందులో భాగంగానే నిన్న సిద్దిపేట ఘటన అని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో దుబ్బాక ఎన్నిక నిర్వహించి.. దమ్ముంటే టీఆర్ఎస్‌ గెలవాలని సవాల్‌ విసిరారు ఆయన..

అధ్యక్షుడి దీక్ష నేపథ్యంలో.. రాష్ట్ర స్థాయి భాజపా నాయకులు కరీంనగర్‌కు భారీగా తరలి వచ్చారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ప్రధానకార్యదర్శి బంగారు శ్రుతి, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌, తదితరులు బండి సంజయ్‌ని పరామర్శించి మద్దతు తెలిపారు. ఉమ్మడి కరీనంగర్‌ జిల్లా వ్యాప్తంగా పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు ఎంపీ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.

బీజేపీ నేతల తీరుపై టీఆర్ఎస్‌ వర్గాలు మండిపడుతున్నాయి.. బండి సంజయ్‌ దీక్ష దొంగే దొంగ అన్నట్టు ఉందన్నారు మంత్రి తలసాని యాదవ్. దుబ్బాకలో ఓడిపోతామని తెలియడంతోనే బీజేపీ నేతలు కొత్త డ్రామాకు తెరలేపారు అన్నారు.. బీజేపీ అభ్యర్థి బంధువు ఇంటిలో నగదు దొరికినా.. తిరిగి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా టీఆర్‌ఎస్‌ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు..

రాజకీయ కాక రేపుతున్న ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించారు.. బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను సిద్దిపేట సీపీ జోయల్‌ డేవిస్‌ ఖండించారు. నిన్నటి ఘటనపై ప్రెస్‌మీట్‌ పెట్టిన సీపీ జోయల్‌ డేవిస్‌.. పలు ఆధారాలను చూపించారు. ఛానెల్స్‌, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తమన్నారు. తామంతా ఎన్నికల కమిషన్‌ పరిధిలో పనిచేస్తున్నామన్నారు. సురభి అంజన్‌రావు ఇంట్లో సోదాలు చేశామన్నారు. అనుమతి తీసుకునే సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. పోలీసుల మీద నమ్మకం లేకపోతే... కలెక్టర్‌కు ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయోచ్చన్నారు సీపీ జోయల్‌ డేవిస్‌.

Tags

Read MoreRead Less
Next Story