Bandi sanjay : బండి సంజయ్ రెండో విడత యాత్ర ఎక్కడి నుంచి?

Bandi sanjay : బండి సంజయ్ రెండో విడత యాత్ర ఎక్కడి నుంచి?
Bandi sanjay : ప్రజాసంగ్రామ యాత్ర... తెలంగాణ‌లో బీజేపీని ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజ‌య్ చేపట్టిన యాత్ర.

Bandi sanjay : ప్రజాసంగ్రామ యాత్ర... తెలంగాణ‌లో బీజేపీని ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజ‌య్ చేపట్టిన యాత్ర. మొద‌టి విడ‌త పాదయాత్రకు ప్రజల నుంచి మంచి రెస్పాన్ వచ్చింది. హైద‌రాబాద్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆల‌యం నుంచి హుజూరాబాద్ వ‌ర‌కు పాదయాత్ర చేపట్టాలని భావించినా ఎన్నికల కోడ్ అడ్డొచ్చింది. దీంతో పాదయాత్రను హుస్నాబాద్‌ వైపు మ‌ళ్ళించారు. అక్కడే ముగింపు సభ నిర్వహించిన బండి సంజ‌య్ రెండో విడ‌త పాదయాత్రను మ‌రో పుణ్యక్షేత్రం నుంచి ప్రారంభించేందుకు ప్లాన్ రెడీ చేశారు.

రెండో విడ‌త పాద‌యాత్రను వ‌రంగ‌ల్ భ‌ద్రఖాళి ఆలయం, గ‌ద్వాల జోగులాంబ, యాదాద్రి లక్ష్మీనరసింహ ఆల‌యాల్లో ఒకదాని నుంచి ప్రారంభించాల‌ని భావించారు. ఎక్కడి నుంచి ప్రారంభించాల‌నేదానిపై మల్లగుల్లాలు పడ్డారు. మొదటి దశలో యాత్రను ఉత్తర తెలంగాణలో నిర్వహించినందున... రెండో విడత పాదయాత్రను దక్షిణ తెలంగాణ నుంచి మొదలు పెట్టాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు. ప‌లు పేర్లను ప‌రిశీలించిన త‌ర్వాత గద్వాల జోగులాంబ అమ్మవారి ఆల‌యం నుంచి పాద‌యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. అందుకు త‌గ్గ ఏర్పాట్లు సైతం చేసుకుంది రాష్ట్ర నాయ‌క‌త్వం.

జోగులాంబ గుడి నుంచి మైసిగండి దాకా చేపట్టాలని భావించిన నేతలు

ఇందుకు జిల్లా నాయ‌క‌త్వం సైతం ఓకే చెప్పార‌ని... అంతేకాదు ఎక్కడి నుంచి ప్రారంభించినా... ఇబ్బంది లేదంటూ అదిష్టానం వ‌ద్ద చెప్పిన‌ట్టు స‌మాచారం. దీంతో జోగులాంబ ఆల‌యం నుంచి మైసిగండి ఆల‌యం వర‌కు పాదయాత్ర చేయాల‌ని మొద‌ట రూట్ మ్యాప్ ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. రెండు ఆల‌యాలు ప్రముఖ‌మైన‌వే కాకుండా అత్యంత శ‌క్తివంత‌మైన ఆల‌యాలుగా పేరొందాయి. ఉమ్మడి మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆల‌యాలు తెలియ‌ని వారుండ‌రు. అంతేకాదు బలమైన శ‌క్తిపీఠం జోగులాంబ ఆల‌యం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తే దిగ్విజ‌యంగా కొనసాగించొచ్చని పాదయాత్ర టీం భావించింది.

ఇక అంతా ఓకే అనుకుని రూట్ మ్యాప్ ఫైన‌ల్ చేసే టైంలో బీజేపీ జాతీయ నేత ఒక‌రు అడ్డుప‌డినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాదు అక్కడి నుంచి రెండో విడ‌త పాదయాత్ర ప్రారంభించ‌డంపై అభ్యంత‌రం చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఆ జిల్లాలో ఇప్పుడు పాద‌యాత్ర చేస్తే ప్రజల నుంచి పెద్దగా స్పంద‌న ఉండ‌ద‌ని చెప్పిన‌ట్టు పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రజ‌లంతా పొలంప‌నుల్లో బిజీగా ఉంటార‌ని.. జ‌నం లేకుండా పాద‌యాత్ర సాగితే పెద్దగా ప్రభావం ఉండ‌దని ఆ నేత అభ్యంత‌రం వ్యక్తం చేసిన‌ట్టు స‌మాచారం. ఆ నేత అనుమ‌తి లేకుండా ఆ జిల్లాలో యాత్ర చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

దీంతో ఏం చేయాల‌నేదానిపై రాష్ట్ర నాయకత్వం మల్లగుల్లాలు పడుతున్నట్లు పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. జోగులాంబ నుంచి కాకపోతే ఎక్కడి నుంచి ప్రారంభించాల‌న్న దానిపైనా స‌మాలోచ‌న‌లు చేశారు బీజేపీ నేత‌లు. చివ‌రికి మ‌క్తల్‌లో కృష్ణాన‌ది ప‌రివాహక ప్రాంతం నుంచే పాదయాత్ర ప్రారంభించి... నాగ‌ర్ క‌ర్నూల్ ప‌ట్టణంలో ముగింపు స‌భ పెట్టేలా నిర్ణయించినట్లు స‌మాచారం.

జిల్లాలో పాదయాత్రకు అడ్డుపడిన నేతపై జిల్లా క్యాడర్ అసహనం!

బండి సంజయ్ వ‌స్తే ఆ నియోజ‌కవ‌ర్గంలో పార్టీ బల‌ప‌డుతుంద‌ని బీజేపీ నేతలు భావించారు. కానీ అక్కడి నుంచి యాత్రను ప్రారంభించవద్దంటూ జాతీయ స్థాయి నేత కుంటి సాకులు చెప్పడం పార్టీ నేతలను విస్మయపరిచింది. త‌న నియోజ‌క వ‌ర్గంలోకి, చివరికి జిల్లాలోకే రాకుండా అడ్డుప‌డుతున్న నేత‌పై జిల్లా కేడ‌ర్ అస‌హ‌నంతో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story