లోటస్‌పాండ్‌ మీటింగ్‌ వెనుక ఆంతర్యం ఏంటి..?

లోటస్‌పాండ్‌ మీటింగ్‌ వెనుక ఆంతర్యం ఏంటి..?
ఈ సమావేశం అనంతరం షర్మిళ కొత్త పార్టీ ప్రకటన చేస్తారని ప్రచారం జరిగినా.. అలాంటి ప్రకటనేమి రాలేదు.

తెలంగాణ పాలిటిక్స్‌లో వైఎస్‌ షర్మిళ ఎంట్రీ ఖాయమైపోయింది. రేపో మాపో కొత్త పార్టీ ప్రకటించడమే తరువాయి. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పెళ్లి రోజునైన ఫిబ్రవరి 9నే కీలక సమావేశాన్ని ఎంచుకోవడం, తెలంగాణలో వైఎస్సాఆర్‌ అభిమానులందరిని ఏకతాటిపై తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం, లోటస్‌పాండ్‌ కేంద్రంగా కీలక భేటీ నిర్వహించడం...చకచకా జరిగిపోయాయి. షర్మిళ రాజకీయ అరంగ్రేట్‌ కన్ఫర్మ్‌ అయినట్లే! అందుకే వైఎస్‌ఆర్‌ అభిమానులతో... లోటస్‌ పాండ్‌ సందడిగా మారిపోయింది. షర్మిళపై కాగితపు పూల వర్షం కురిపించారు. బాణా సంచా కాలుస్తూ హంగామా చేశారు.

తొలిరోజు.. నల్గొండ జిల్లా నేతలతో సుధీర్ఘంగా చర్చలు జరిపారు షర్మిళ. తెలంగాణలో రాజన్న రాజ్యం తెవడమే లక్ష్యమని, ఇక్కడ అందరూ సంతోషంగా ఉన్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు షర్మిళ. త్వరలో మిగిలిన జిల్లాల నేతలతోనూ సమావేశమవుతామన్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకు సమావేశాలు ఏర్పాట్లు చేశామని, త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.

ఈ సమావేశం అనంతరం షర్మిళ కొత్త పార్టీ ప్రకటన చేస్తారని ప్రచారం జరిగినా.. అలాంటి ప్రకటనేమి రాలేదు. దీంతో అస్సలు లోటస్‌పాండ్‌ మీటింగ్‌ వెనుక ఆంతర్యం ఏంటన్నది చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో.. లోటస్‌ పాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లలో ఎక్కడా జగన్ ఫొటో లేకపోవడం కూడా అనేక ప్రశ్నలకు తావిచ్చింది. ఈ ఫ్లెక్సీల్లో కేవలం షర్మిళ ఒక్కరే కనిపించడం, అన్న పని అన్నది.. తన పని తనది అని షర్మిళ అనడం చూస్తుంటే... వైసీపీకి సంబంధం లేకుండా సొంత కుంపటి పెడుతున్నారా అన్న అనుమానాలు తలెత్తాయి. అంతేకాదు YSR అభిమానులకు దారి చూపేందుకే ఈ సమావేశం అనడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.

మరోవైపు.. చేవెళ్ల సెంటిమెంట్‌ను కూడా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు షర్మిళ. అక్కడ నుంచే పాదయాత్ర చేయాలని వ్యూహరచన చేస్తున్నారు. పొలిటికల్ ఎంట్రీకి తెలంగాణను ఎంచుకోవడం కూడా వ్యూహంలో భాగమేనంటున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో రెడ్లు ఇమడలేని పరిస్థితి ఉందని.. అందుకే చాలా మంది బీజేపీవైపు చూస్తున్నారని, అలాంటి వారిని తమవైపు తిప్పుకోవడం ఆమె లక్ష్యం అయిఉండొచ్చని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా బీజేపీ బలపడకుండా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి TRSకి లబ్ది చేకూర్చడమే అంతిమ లక్ష్యంగా కనిపిస్తోందంటున్నారు. అయితే అదే సమయంలో తొలి స్పీచ్‌లోనే వ్యూహాత్మకంగా TRSపై షర్మిళ విమర్శలు చేయడమూ ఆసక్తి రేపింది.

వైసీపీలో షర్మిళలకు గుర్తింపు లేదనే ప్రచారం కొన్నాళ్లుగా సాగుతోంది. అందుకే ఆమె కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారనే ప్రచారమూ జరుగుతోంది. వైఎస్‌ కుటుంబం ఆశీర్వదించి పంపించారా? లేక ఈ అవకాశాన్ని షర్మిళే వెతుక్కున్నారా..? అన్నది కూడా స్పష్టత లేదు. ఆత్మీయ సోదరి పార్టీ ప్రయత్నాలకు ఇంట్లో సపోర్ట్ ఎంతనేది పోనుపోను తెలుస్తుందేమో. అన్నతో విభేదాలుంటే ఏపీలో పార్టీ పెట్టాలి కానీ.. తెలంగాణలో ఎందుకు..? అన్నదికి కూడా మిలియన్‌ డాలర్‌ ప్రశ్న. కానీ జగన్‌, షర్మిళ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఉండేవి కేవలం అభిప్రాయా బేధాలేనంటున్నారు వైసీపీ సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.

సజ్జల చెప్తున్నట్టు ఇవి కేవలం భిన్నాభిప్రాయాలు మాత్రమేనా..? అన్నది కాలమే నిర్ణయించాలి. చెల్లెమ్మ పార్టీకి అన్నయ్య ఆల్‌ ది బెస్ట్ చెప్పారు సరే.. అసలు లెక్కేంటి అన్నది కూడా తేలాల్సి ఉంది. ఈ మొత్తం పొలిటికల్ స్క్రీన్‌ప్లే తెరవెనుక బ్రదర్ అనిల్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మరి షర్మిళ పార్టీ తెలంగాణలో సక్సెస్ అవుతుందా? తెలంగాణకే పరిమితమవుతుందా? లేక ఏపీ వైపు కూడా చూస్తారా అన్నది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story