పొలిటికల్ హీటెక్కిన హుజూరాబాద్ కు 2000 ఏళ్ల చరిత్ర..!

పొలిటికల్ హీటెక్కిన హుజూరాబాద్ కు 2000 ఏళ్ల చరిత్ర..!
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో తెలంగాణా రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది.

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో తెలంగాణా రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఈటెల రాజీనామాతో హుజురాబాద్ లో ఉపఎన్నిక అనివార్యం అయింది. దీనితో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇలా అన్నీ పార్టీలు హుజురాబాద్ పైన ఫోకస్ చేశాయి. అయితే ఈ హుజురాబాద్ ప్రాంతం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పురావాస్తు చరిత్ర పరిశోధకుడు ఆర్‌.రత్నాకర్‌రెడ్డి వెల్లడించారు.

హుజూరాబాద్‌కు రెండువేల ఏళ్ల చరిత్ర ఉందని ఆర్‌.రత్నాకర్‌రెడ్డి తెలిపారు. హుజూరాబాద్‌ రంగనాయకుల గుట్ట దిగువన రెండు వేల ఏళ్లనాటి ఆనవాళ్లను ఆయన గుర్తించారు. ఇక్కడ ఉన్న గ్రామాన్ని ఏదులాపురమని, కాలక్రమేణా ఇది హుజూరాబాద్‌గా రూపుదిద్దుకున్నదని తెలిపారు. అనేక వృత్తుల వారు జీవించిన ఇంత పెద్ద గ్రామానికి వైద్యులు కూడా అవసరమే అని, అందుకే ఇక్కడ సాధారణ రోళ్లకు భిన్నంగా పరుపు బండలపై వరుసగా మూడు రోళ్లు ఉన్నాయని, ఇవి లోతు తక్కువగా ఉండటంతో పాటు వెడల్పు ఎక్కువగా ఉన్నాయని వివరించారు.


వీటిని ఆయుర్వేద వైద్యం కోసం ఉపయోగించి ఉండవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి 40కిలోమీటర్లు, వరంగల్‌ జిల్లాకు 30కిలో మీటర్ల దూరంలో ఉన్న హుజూరాబాద్‌ శివారులో రంగనాయకులగుట్ట పరిసర ప్రాంతాల్లో నవీన శిలాయుగం నుంచి మొదలు శాతవాహనుల కాలానికి సంబంధించిన ఆధారాలను ఆయన కనుగొన్నారు. ఇక నూరడానికి, దంచడానికి ఉపయోగించే రోకలి బండ ఒకటి లభించగా, ఇటువంటి రోళ్లను గతంలో హనుమకొండలోని అగ్గలయ్య గుట్టపై గుర్తించినట్లు రత్నాకర్‌రెడ్డి తెలిపారు.

పెద్ద పెద్ద కాగులు, చక్రంపై తయారు చేసే బాగా కాల్చిన నాణ్యమైన ఎరుపు, నలుపు, బూడిద రంగు, గోధుమరంగు, మట్టి పాత్రలు కనిపించాయి. మంచి ఆకృతి గల ఎరుపు రంగు మట్టి పూసలతో పాటు రంగు రాళ్లు కనిపించాయి. తేలికైన ఇటుకలు, గూన పెంకులు లభ్యమైనట్లు వెల్లడించారు. అటు ఈ ప్రాంతంలో రెండు వేల ఏళ్ల కిందటే ఇనుము, ఉక్కు పరిశ్రమ ఉందని తన పరిశోధనలో వెల్లడైనట్లు తెలిపారు. పురావాస్తు శాఖ వారు ఇక్కడ తవ్వకాలు జరిపితే మరిన్ని విషయాలు బయటపడవచ్చునని అన్నారు. మరి ఇంతటి చరిత్ర ఉన్న ఈ హుజురాబాద్ ప్రాంతంలో జరబోయే ఉపఎన్నికలో ఏ పార్టీ గెలుస్తుందో చూడాలి మరి.

Tags

Read MoreRead Less
Next Story