తెలంగాణ

భూమా అఖిల ప్రియకు మరోసారి చుక్కెదురు

జీవిత కాలం శిక్ష పడే కేసులు తమ పరిధిలోకి రావని సికింద్రాబాద్ కోర్టు స్పష్టం చేసింది.

భూమా అఖిల ప్రియకు మరోసారి చుక్కెదురు
X

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. ఆమె బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించింది. జీవిత కాలం శిక్ష పడే కేసులు తమ పరిధిలోకి రావని సికింద్రాబాద్ కోర్టు స్పష్టం చేసింది. సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్‌ వేసుకోవాలని కోర్టు సూచించింది. దీంతో బెయిల్ కోసం అఖిల ప్రియ... నాంపల్లి కోర్టులో దరఖాస్తు చేయనున్నారు. కిడ్నాప్ కేసులో అఖిల ప్రియకు ఉక్కుబిగుసుకుంటోంది. ఆమెపై అదనపు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు బోయిన్‌పల్లి పోలీసులు మెమో దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 395 దోపిడీ కేసును పోలీసులు నమోదు చేశారు.

అఖిల ప్రియపై సికింద్రాబాద్ కోర్టులో వాదనలు కొనసాగాయి. అయితే అఖిల ప్రియకు బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. పిటిషనర్‌కు గతంలో నేర చరిత్ర ఉందని, ఆమె కుటుంబానికి ఫ్యాక్షన్ చరిత్ర ఉందని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. అఖిల ప్రియ మాజీ మంత్రి కావడం, డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకే బెయిల్ ఇవ్వొద్దని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. నేరానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు.

పరారీలో ఉన్న నిందితుల కోసం దర్యాప్తు బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని కోర్టుకు తెలిపారు. ఈ కేసు నుంచి తప్పించుకోడానికి, మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. అంతేకాదు కిడ్నాప్ కేసు నిందితులను దోపిడీ దారులుగా పరిగణించాలని కూడా కోర్టును కోరారు. అఖిల ప్రియ భర్త భార్గవ రామ్ నేరప్రవృత్తి కలిగిన వ్యక్తి అని కోర్టుకు తెలిపారు. పరారీలో ఉన్న కీలక నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని, ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులను విచారించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ అఖిల ప్రియకు బెయిల్ ఇవ్వొద్దని బోయిన్‌పల్లి పోలీసులు కోర్టును కోరారు. పోలీసులతోపాటు అఖిల ప్రియ తరఫు న్యాయవాది వాదనలు విన్న కోర్టు.. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.

మరోవైపు బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవ రామ్ సికింద్రాబాద్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు తీర్పును ఈ నెల 21కి వాయిదా వేసింది.

ఇక బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. రోజుకో ట్విస్టు వెలుగు చూస్తోంది. ఈ కేసులో కొత్తగా 15 మందిని పోలీసులు అరెస్ట్‌ చేయగా.. మొత్తం అరెస్టైన వారి సంఖ్య 19కి చేరింది. ఇప్పటి వరకు భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌ అనుకున్న పోలీసులు ఆ తరువాత భార్గవ్‌రామ్‌ సోదరుడు చంద్ర హాస్ పేరు విచారణలో బయటపడింది. ఆ తరువాత అఖిలప్రియ మరో సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు.

ప్రవీణ్ రావు, నవీన్ రావు, సునీల్ రావును... కిడ్నాప్ చేసేందుకు పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసులు తెలిపారు. కిడ్నాప్ చేయడానికి భార్గవ్ రామ్ సన్నిహితుడు గుంటూరు శీను తనకు మనుషులు కావాలని ఈవెంట్ మేనేజర్ సిద్ధార్థ్ అనే వ్యక్తిని ఆశ్రయించడని పోలీసులు చెప్పారు. దీంతో సిద్ధార్థ్ 15 మంది కిడ్నాపర్లను, కారును ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు.

ఆ తర్వాత వాళ్లను హైదరాబాద్‌ తీసుకొచ్చి కూకట్‌పల్లిలో మకాం పెట్టారని చెప్పారు. వాళ్లలో ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించి... ఆ తర్వాత పక్కా ప్లాన్‌తో కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు. ప్రవీణ్ రావు, నవీన్ రావు, సునీల్ రావు ముగ్గుర్ని మూడు వాహనాల్లో కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లగా.. అందులో రెండు వాహనాలను భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డ్ డ్రైవ్ చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్నవాళ్ల కోసం వేట సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story

RELATED STORIES