Vikarabad: వారాంతం వస్తే రెచ్చిపోతున్న ఆకతాయిలు

Vikarabad: వారాంతం వస్తే రెచ్చిపోతున్న ఆకతాయిలు


వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. బైకులు, కార్లతో నానాహంగామా సృష్టిస్తున్నారు. ఇంత జరుగుతున్న ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో.. పర్యాటక ప్రాంతమైన అనంతగిరిలో దారుణ పరిస్థితులున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలుషితం చేస్తు అంతా మా ఇష్టం.. మమ్మల్ని అడిగేది ఎవరు అన్న చందంగా మద్యం తాగుతాం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఊటీగా పిలవబడే అనంతగిరి అటవీ ప్రాంతానికి వారాంతపు సెలవుల్లో వేల సంఖ్యలో కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు.

అనంతరం అడవి అందాలని చూస్తూ ఆహ్లాదంగా గడుపుతారు. అయితే ప్రస్తుత పరిస్థితి పరిశీలిస్తే కొందరు టూరిజం పేరుతో అనంతగిరికి వచ్చి దర్జాగా మద్యం వెంట తెచ్చుకొని విచ్చలవిడిగా తాగుతూ బైక్‌లు, కార్లతో స్టంట్ లు చేస్తూ వాతావరణాన్ని కలుషితం చేయడమే గాక ఇతర పర్యాటకులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. మంగళవారం పెద్ద ఎత్తున యువకులు బైకులు కార్లతో నానా హంగామా సృష్టించారు. వారి హంగామా చూసిన పర్యాటకులు స్థానికులు హాడలెత్తిపోయారు. ఇంత జరుగుతున్న ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నట్టు అని ప్రజలు మండిపడుతున్నారు.

అనంతగిరి పర్యాటక ప్రాంతంలో దారుణ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. వారాంతం వస్తే చాలు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. దీంతో పచ్చని ప్రకృతి, ఆధ్యాత్మికతకు నిలయమైన అనంతగిరులకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాలంటే భయపడే పరిస్ధితులు నెలకొన్నాయి. నిన్న సెలవు దినం కావడంతో వేలాది మంది అనంతగిరికి వచ్చారు. కొంత మంది యువత అనంతగిరి వ్యూ పాయింట్ల వద్ద బైక్ రేసులు, కారు రేసులతో అలజడి సృష్టించారు. పెద్ద పెద్ద శబ్ధాల వల్ల వన్యప్రాణులు రోడ్లపైకి వచ్చే పరిస్థితి నెలకొంది. అడవుల్లోకి అనుమతి లేకున్నా అటవీ శాఖ కింది స్ధాయి సిబ్బంది కొందరు డబ్బులు తీసుకుని వారిని లోపలికి పంపించడం వల్లే ఈపరిస్థితి ఏర్పడుతుందని స్ధానికులు ఆరోపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story