BJP: కేంద్ర క్యాబినేట్ లో తెలంగాణకు మరో స్థానం దక్కనుందా?

BJP: కేంద్ర క్యాబినేట్ లో తెలంగాణకు మరో స్థానం దక్కనుందా?
కిషన్ రెడ్డి కేబినేట్ లో ఉన్నా మరో మంత్రపదవి రాష్ట్రానికి ఇస్తారని జోరుగా చర్చ మోదలైంది...

కేంద్ర క్యాబినేట్ విస్తరణలో తెలంగాణకు చోటు దక్కుతుందా.. ఇప్పటికే కిషన్ రెడ్డి కేబినేట్ లో ఉన్నా మరో మంత్రపదవి రాష్ట్రానికి ఇస్తారని జోరుగా చర్చ మోదలైంది. నిజంగానే జాతీయ నాయకత్వం తెలంగాణకు మరో బెర్త్ ఇస్తుందా.. లేదా ఉత్తరాది రాష్ట్రాల వైపే మొగ్గుచూపుతారా.. తెలంగాణ నేతల ఆశలు నెరవేరుతాయా.. జాతీయ నాయకత్వం వద్ద ఉన్న లెక్కేంటి..


బీజేపీ జాతీయ నాయకత్వం దక్షిణాదిన గేట్ వేగా తెలంగాణను భావిస్తోంది. తెలంగాణలో పాగా వేస్తే ఇక దక్షిణాదిన విస్తరణకు పెద్దగా అడ్డంకులు ఉండకపోవచ్చనే చర్చ సాగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఇదే అదునుగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని పావులు కదుపుతోంది. ముందుగా సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు జాతీయ నాయకత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకున్న తరువాత తమ కార్యాచరణను వేగవంతం చేసేందుకు నిర్ణయించింది నాయకత్వం.

ఇక మరోవైపు ఎన్నికలకు మరో ఏడాది సమయం మాత్రమే ఉంది. ప్రజలను తమ వైపు తిప్పుకోవాలంటే ఇక్కడ మరింత దృష్టి సారించిందన్న అభిప్రాయం కలగాలంటే ఏం చేయాలన్న యోచనలో పడిందట జాతీయ నాయకత్వం. ఇప్పటికే జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న దానిపైనా ప్రజలకు అవగాహకల్పిస్తున్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను క్షేత్ర స్థాయిలో ఎండగడుతున్న జాతీయ నేతలు రాబోయే రోజుల్లో మరింత విస్తృత పర్యటనలకు సన్నద్దం అవుతున్నారు.

ఇదే తరహాలో రాష్ట్రానికి ఓ కేంద్ర మంత్రిపదవిని ఇవ్వాలని జాతీయ నాయకత్వం యోచిస్తున్నట్టుగా వార్తలు గుప్పుమంటున్నాయి. సంక్రాంతి పండగ తరవాత జరిగే క్యాబినేట్ విస్తరణలో రాష్ట్రానికి ఓ బెర్త్ ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఈ బెర్త్ ఎవరికి దక్కుతుందన్న దానిపై ఎవరి అంచానాలు వారు వేసుకుంటున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డాక్టర్ లక్ష్మణ్ తో పాటు ఎంపీ అరవింద్ లలో ఒకరికి ఆ బెర్త్ అంటూ వారి అనుచరులు చెప్పుకుంటున్నారు. అయితే వీరిద్దరికేనా లేక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అనూహ్యంగా ఆ బెర్త్ వరిస్తుందా అంటూ మరోవర్గం చర్చకు తెరలేపింది.. అయితే తనకు కేంద్ర మంత్రి కావాలన్న కోరిక లేదని.. తాను కేవలం పార్టీ ని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తానని సన్నిహితుల వద్ద సంజయ్ చెప్పుకుంటున్నట్టు సమాచారం.

అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదంటూ కొట్టిపారేస్తున్నాయి. జాతీయ నాయకత్వంతో సన్నిహితంగా ఉండే వర్గాలు, కేబినేట్ బెర్త్ ఈ సారి తెలంగాణకు కష్టమే అంటూ చెప్పుకుంటున్నారు. రాష్ట్రానికి కేబినేట్ బెర్త్ ఇవ్వడం వల్ల కలిగే లబ్దిపైనా లెక్కలు వేసుకుంటున్నారట జాతీయ నేతలు. ఇప్పటికే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉండగా మరో మంత్రి పదవి ఇవ్వడం కంటే రాష్ట్రంలో మరేదైనా కార్యాచరణ అమలు చేయడం ద్వారా పార్టీకి లబ్దిచేకూరుతుందన్న భావనలో ఉన్నారట. తమ కార్యాచరణను పగడ్బందీగా అమలు చేయడం ద్వారా పార్టీని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకు వెళ్లడంపైనే దృష్టి సారించాలని చెబుతున్నట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story