BJP Vs BRS: బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల యుద్ధం

BJP Vs BRS: బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల యుద్ధం
ఆగస్టు మొదటి వారంలో ఇళ్ల పంపిణీకి ప్రభుత్వ ఏర్పాట్లు; డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల పరిశీలనకు బయల్దేరిన బీజేపీ నేతల అరెస్టు

నిన్నటి వరకు కరెంటు మంటల్లో తెలంగాణ రాజకీయాలు భగ్గుమంటే.. ఇప్పుడు డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లపై పెద్ద యుద్ధమే జరుగుతోంది.. ఆగస్టు మొదటి వారంలో ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండగా బీజేపీ నేతలు ఇళ్ల పరిశీలనకు బయల్దేరడం ఉద్రిక్తతకు కారణమైంది.. ముందస్తు అరెస్టులతో పోలీసులు బీజేపీ నేతలపై విరుచుకుపడుతుంటే.. ఆ అడ్డంకులను దాటుకుంటూ బీజేపీ శ్రేణులు ఇళ్ల పరిశీలను వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.. ఎక్కడికక్కడ బీజేపీ నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు.. ఉదయం నుంచే హౌస్‌ అరెస్టులు కొనసాగాయి.. ఈటల రాజేందర్‌ను ఇంట్లోనే నిర్బంధించగా.. డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను చూసేందుకు ఎమ్మెల్యే రఘునందన్‌రావు వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇళ్లను పరిశీలించేందుకు బాటసింగారం వెళ్తుండగా కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు సమీపంలో పోలీసులు ఆయన్ను అడ్డకున్నారు.. కిషన్ రెడ్డిని అడ్డుకోవడంపై అటు బీజేపీ కార్యకర్తల ఆగ్రహం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా కిషన్ రెడ్డి, రఘునందన్, రామచంద్రారెడ్డి రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని, తనను ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కాన్వాయ్‌నే అడ్డుకుంటారా అంటూ తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. తాను ఏమైనా ఉగ్రవాదినా అంటూ పోలీసులను ప్రశ్నించారు. కేసీఆర్ జైళ్లు సిద్ధం చేసుకోవాలని, తామంతా జైలుకు వెళ్లేందుకు సిద్ధమని కిషన్ రెడ్డి అన్నారు. ఇది కల్వకుంట్ల రాజ్యమా.. పోలీసుల రాజ్యమా అంటూ నినాదాలు చేశారు.

అయితే కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బలవంతంగా తరలించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రతిఘటించారు. కిషన్‌ రెడ్డిని కారులోనే నాంపల్లి బీజేపీ కార్యాలయానికి తరలించారు పోలీసులు. బీజేపీ నేతలను తలోవైపునకు తరలించిన పోలీసులు.. కిషన్‌రెడ్డిని పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే మీదుగా రూటు మార్చి.. మార్చి సిటీలోకి తరలించారు.కేంద్ర మంత్రి వాహనాన్ని స్వయంగా శంషాబాద్‌ డీసీపీ డ్రైవ్ చేశారు. అటు బీజేపీ నేతలు ఈటల, డీకే అరుణను హౌస్ అరెస్ట్ చేశారు.

అటు కేసీఆర్‌ ప్రభుత్వంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు మండిపడ్డారు.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను చూడటానికి వెళ్తుంటే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉలికిపాటెందుకని ప్రశ్నించారు. కేంద్ర నిధుల వాటాను కూడా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. భారత పౌరుడిగా, కేంద్ర మంత్రిగా కిషన్‌ రెడ్డి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించే అధికారం ఉందని అన్నారు. తాము ముందే పోలీసులకు సమాచారం అందించామని.. కానీ పోలీసులే అనసరంగా అడ్డుకున్నారని అన్నారు. డబుల్ బెడ్ ఇళ్లు గొప్పగా నిర్మిస్తే ఈ అక్రమ అరెస్టులు ఎందుకని అన్నారు.ఇదేమైనా ఉద్యమమా.. లేక తిరుగుబాటా అని ప్రశ్నించిన ఆయన హౌస్ అరెస్టులు, అక్రమ అరెస్టులు..బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట అని అన్నారు.

అయితే, ఇదంతా బీజేపీ డ్రామా అని బీఆర్‌ఎస్‌ నేతలు విరుచుకుపడుతున్నారు.. అడ్డుకోవడం లేదు, ఇళ్లను పరిశీలించడానికి వెళ్లడం తప్పా అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.. అయితే, దీనికి బీఆర్‌ఎస్‌ నేతలు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బురద చల్లేందుకే బీజేపీ బాట సింగారం డబుల్‌ బెడ్ రూం ఇళ్ల పరిశీలన కార్యక్రమం చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.. కేంద్ర మంత్రి వర్షంలో రోడ్డుపై కూర్చోవడం సరికాదన్నారాయన. కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్ రూం ఇళ్లలో రాజకీయం తగదన్నారు. బీజేపీ పేదలపై ప్రేమ ఉన్నట్లు చూపే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు తలసాని.


Tags

Read MoreRead Less
Next Story