వరలక్ష్మిని పరామర్శించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు

వరలక్ష్మిని పరామర్శించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు


హైదరాబాద్ ఎల్బీనగర్‌లో పోలీసుల చేతిలో తీవ్రంగా గాయపడ్డ గిరిజన మహిళ వరలక్ష్మి కోలుకుంటోంది. కర్మాన్‌ఘాట్‌లోని జీవన్‌ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. వరలక్ష్మికి న్యాయం చేయాలని మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాయి. మహిళా సంఘాల ధర్నాతో కర్మాన్‌ఘాట్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు రెండు కిలోమీటర్ల మేర గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

వరలక్ష్మిని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పరామర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన బాధితురాలితో మాట్లాడారు. కేసు వివరాలు తెలుసుకున్నారు. వరలక్ష్మి పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని రఘునందన్‌రావు మండిపడ్డారు. ప్రతి చిన్న విషయంపై ట్విట్టర్‌లో స్పందించే కేటీఆర్‌...ఈ దారుణంపై ఎందుకు మాట్లాడడం లేదన్నారు. మహిళలకు తానున్నానంటూ ముందుండే కవితక్క ఎక్కడికిపోయిందని ప్రశ్నించారు. బాధితురాలి కుటుంబానికి రఘునందన్‌రావు కొంతమేర ఆర్థికసాయం అందజేశారు.


వరలక్ష్మిపై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించడం దారుణమని కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ మండిపడ్డారు. జీవన్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితురాల్ని ఆయన పరామర్శించారు. వరలక్ష్మిని కొట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. బాధితురాలికి కాంగ్రెస్‌ అండగా ఉంటుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story