BJP: ఉత్సాహంగా బీజేపీ విజయ సంకల్ప యాత్ర

BJP: ఉత్సాహంగా బీజేపీ విజయ సంకల్ప యాత్ర
లోక్‌సభలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు... పాల్గొంటున్న జాతీయ నేతలు

లోక్‌సభలో అత్యధిక స్థానాల్లో... గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ.. క్షేత్రస్థాయిలో ముందుకెళ్తోంది. తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయసంకల్ప యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్రం నలుమూలల్ని కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు చుట్టేస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ఎక్కువ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర... మంచిర్యాల జిల్లాకు చేరుకుంది. బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో.. కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇది ముగింపు సభ అని కిషన్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ తరహాలోనే కాంగ్రెస్‌ పాలన సాగుతోందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు గెలిచినా వృథానే అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లడం ఖాయమని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు.


ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత త్వరలో జైలుకు వెళ్తారని కేంద్ర మంత్రి అశ్విన్‌ కుమార్‌ చౌబే తెలిపారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చేరుకున్న నేపథ్యంలో కార్నర్‌ మీటింగ్‌లో కేంద్ర మంత్రి తీవ్ర స్థాయిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలపై ఆరోపణలు చేశారు. అవినీతి పరులంతా కలిసి ఇండియా కూటమి అంటూ ఒక గ్రూపును తయారు చేసుకున్నారని ఆయన విమర్శించారు. మహబూబ్‌నగర్ పార్లమెంటు పరిధిలో.. జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. మోడీ మూడోసారి ప్రధాని కాకుండా ఏ పార్టీ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. బాలానగర్ మండలం రాజాపూర్, జడ్చర్ల, మిడ్జిల్, ఉరుకొండ పేట మీదుగా యాత్ర కొనసాగింది. బీజేపీ విజయసంకల్ప యాత్రలతో.. క్షేత్రస్థాయిలో కమలదళంలో కొత్త ఉత్సాహం వచ్చినట్లు అవుతోంది. ఎక్కడికక్కడ శ్రేణులు ప్రజల్లోకి వెళ్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story