డైలీ సీరియల్‌ను తలపిస్తున్న బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు

డైలీ సీరియల్‌ను తలపిస్తున్న బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు
ఆరోగ్యం బాగోలేనందున బెయిల్‌ మంజూరు చేయాలని అఖిలప్రియతరపు న్యాయవాది కోర్టును కోరారు.

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు డైలీ సీరియల్‌ను తలపిస్తుంది. ఈ కేసులో కొత్తగా 15 మందిని అరెస్ట్‌ చేయగా.. మొత్తం అరెస్టైన వారి సంఖ్య 19కి చేరింది. దర్యాప్తులో కొత్త కొత్త పేర్లు బయట పడుతున్నాయి. ఇప్పటి వరకు భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌ అనుకున్న పోలీసులు ఆ తరువాత భార్గవ్‌రామ్‌ సోదరుడు చంద్ర హాస్ పేరు విచారణలో బయటపడింది. ఆ తరువాత అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఇలా నలుగురితో మొదలైన కిడ్నాప్ కేసులో దాదాపు చాలా మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.

కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న భూమా అఖిలప్రియను కష్టడీలోకి తీసుకున్న తరువాత మరికొంత సమాచారం బయట పడిందని పోలీసులు తెలిపారు. మొత్తం 19 మందిలో ఎవరి ప్రమేయం ఏంటి అనేది కూడా తేల్చారు పోలీసులు. ప్రవీణ్ రావు, నవీన్ రావు, సునీల్ రావును కిడ్నాప్ చేసేందుకు ఓ పథకం రచించారని, కిడ్నాప్ చేయడానికి భార్గవ్ రామ్ సన్నిహితుడు గుంటూరు శీను తనకు మనుషులు కావాలని ఈవెంట్ మేనేజర్ సిద్ధార్థ్ అనే వ్యక్తిని ఆశ్రయించాడు. ఒక్కొక్కరి 25 వేలు చొప్పున డబ్బులు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వగా, అడ్వాన్స్‌గా 75 వేలు రూపాయలు సైతం గుంటూరు శీను పంపినట్లు తేలింది. గుంటూరు శీను చెప్పినట్లుగానే కిడ్నాప్ కోసం 15 మంది కిడ్నాపర్లను, కారును ఏర్పాటు చేశాడు సిద్దార్థ్. ఇక కిడ్నాప్ చేసేందుకు మనుషులు రెడీ అయ్యాక వారిని హైదరాబాద్ తీసుకొచ్చి కూకట్ పల్లిలోని ఓ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడ నుంచి యూసఫ్ గూడలోని ఎంజీఎం స్కూల్‌లో జనవరి నాలుగో తేదీన కిడ్నాప్‌కి పథకం వేశారు. అనంతరం నాలుగో తేదీన, ఐదో తేదీన బోయా సంపత్, బాల చెన్నయ్య అనే ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసేందుకు ప్రవీణ్ రావు ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. అంతా ఓకే అనుకున్న తరువాత ఐదు వాహనాల్లో ఐటీ అధికారులు పేరుతో వచ్చి కిడ్నాప్ చేసినట్లు తేలిందని తెలిపారు సీపీ అంజనీ కుమార్‌.

ప్రవీణ్ రావు, నవీన్ రావు, సునీల్ రావు ముగ్గుర్ని మూడు వాహనాల్లో కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లగా.. అందులో రెండు వాహనాలను భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డ్ డ్రైవ్ చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. పథకం ప్రకారం కిడ్నాప్ చేసిన తరువాత ముగ్గురు సోదరులను మొయినాబాద్‌లోని భార్గవ్ రామ్ ఫామ్ హౌస్‌కి తీసుకెళ్లారని, అక్కడ మూడు బాండ్ పేపర్లుపై సంతకాలు చేయించుకున్నట్లు నిందితులు వెల్లడించినట్లు తెలిపారు సీపీ అంజనీ కుమార్. కిడ్నాప్ కోసం వాడిన వాహనాలకు నకిలీ నెంబర్ ప్లేట్‌లు అంటించినట్లు తేలిందన్నారు.

ఈ కిడ్నాప్ కోసం వచ్చిన 15 మందిని పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్‌తో అరెస్ట్ చేశారు. అందులో కానిస్టేబుల్ డ్రెస్‌లో వచ్చి కిడ్నాప్ చేసిన దేవర కొండ కృష్ణ కూడా ఉన్నాడు. కూకట్ పల్లిలోని లోథా అపార్ట్మెంట్‌లో ప్లాన్ చేసి, యూసఫ్ గూడ స్కూల్‌లో కిడ్నాప్‌ రిహార్సల్స్ చేసి, బోయిన్ పల్లి ప్రవీణ్ రావు ఇంట్లో అమలు పరిచినట్లు పోలీసులు తేల్చారు. భార్గవ్ రామ్ తల్లిదండ్రులు ప్రమేయం ఉంటే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈకేసులో భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి, చంద్ర హాస్, గుంటూరు శీను కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారిని అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటపడొచ్చని భావిస్తున్నారు.

ఇక అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్‌ రిమాండ్‌లో వున్నారు.. ఆరోగ్యం బాగోలేనందున బెయిల్‌ మంజూరు చేయాలని అఖిలప్రియతరపు న్యాయవాది కోర్టును కోరారు. మరి, కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story