డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పరిశీలనకు బ్రేక్.. కారణం ఇదే..

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పరిశీలనకు బ్రేక్.. కారణం ఇదే..
హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పరిశీలన పర్యటనకు బ్రేక్ పడింది. రెండో రోజు ఇళ్ల పరిశీలన అర్ధాంతరంగా ముగిసింది. తొలిరోజు జియాగూడ తదితర ప్రాంతాల్లో 3 వేల..

హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పరిశీలన పర్యటనకు బ్రేక్ పడింది. రెండో రోజు ఇళ్ల పరిశీలన అర్ధాంతరంగా ముగిసింది. తొలిరోజు జియాగూడ తదితర ప్రాంతాల్లో 3 వేల 400 ఇళ్లను మంత్రి తలసాని, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలిసి పరిశీలించారు. శుక్రవారం రాంపల్లిలో ఇళ్ల పరిశీలనకు వెళ్లారు. అయితే ఉదయం నుంచి చూపిన నిర్మాణాలు గ్రేటర్ పరిధిలోకి రావని భట్టి విక్రమార్క అన్నారు. మహేశ్వరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి రాదని చెప్పారు. నిన్న చూపిన ఇళ్లనే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. భట్టి వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి తలసాని.. కొల్లూరుకు రావాలంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయారు. 150 డివిజన్ల పరిధిలో ఎక్కడ చూపించినా వస్తామని కాంగ్రెస్‌ నేతలు అనడం.. పూర్తిగా చూడకుండా మాట్లాడొద్దని తలసాని అనడంతో ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి.. నాగారం మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్‌ నేతలు వెనుదిరగగా.. భట్టి విక్రమార్క రాంపల్లిలోనే ఆగిపోయారు. ఎవరిదారిన వారు వెళ్లిపోవడంతో రెండో రోజు ఇళ్ల పరిశీలన అర్థంతరంగా ఆగిపోయింది. అయితే, అక్కడ్నుంచి మంత్రులు తలసాని, మల్లారెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కొల్లూరు వెళ్లిపోయారు. తర్వాత ఒకరిపై తలసాని, భట్టి ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. జీహెచ్‌ఎంసీ ఇళ్లు చూపించమంటే మహేశ్వరంలో చూపిస్తున్నారంటూ భట్టి విక్రమార్క మండిపడ్డారు.. లక్ష డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు ఎక్కడున్నాయో చెప్పాలంటూ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు మరోసారి సవాల్‌ విసిరారు భట్టి విక్రమార్క.

కాంగ్రెస్ నేతల తీరును మంత్రి తలసాని తప్పుబట్టారు. స్థాయికి తగ్గి కాంగ్రెస్ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆహ్వానించామని.. అయినాసరే కాంగ్రెస్ నేతలు కావాలనే తప్పించుకోడానికి ప్రయత్నాలు చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ సంకల్పంతో వారిని ఆహ్వానిస్తే మేము పారిపోయాం అని అంటున్నారంటూ ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులను తామే సాదరంగా పంపించేశామని అన్నారు. కాంగ్రెస్ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని తలసాని మండిపడ్డారు. మొత్తంగా లక్ష ఇళ్లు చూపించే వరకు ప్రభుత్వం వెంట పడతామని కాంగ్రెస్‌ నేతలు అంటుంటే.. లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వివరాలను కాంగ్రెస్ నాయకుల ఇంటికి పంపుతామని, వాళ్లే వెళ్లి చూసుకోవాలంటూ మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. అంతేకాదు, కాంగ్రెస్‌ హయాంలో కట్టిన ఇళ్లపైనా తలసాని విమర్శలు గుప్పించారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు నిర్మిస్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినా.. 33 వేల 558 ఇళ్లను మాత్రమే నిర్మించారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇళ్లు కడతామన్న ప్రాంతాలు కూడా జీహెచ్ఎంసీకి దూరంగా ఉన్నాయని తలసాని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story