CBI: సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత

CBI: సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత
రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించిన సీబీఐ... మూడు రోజుల సీబీఐ కస్టడీకి కవిత

ఢిల్లీ మద్యం కేసులో ఈడీ అరెస్టు తర్వాత జుడీషియల్‌ కస్టడీలో భాగంగా తిహాడ్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గురువారం అరెస్టు చేసిన CBI రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. ఈ కేసులో తదుపరి విచారణ కోసం ఐదురోజుల కస్డడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును అభ్యర్థించింది. ఇందుకు సంబంధించి కోర్టుకు రిమాండ్‌ రిపోర్టు సమర్పించిన కేంద్ర దర్యాప్తు సంస్థ కవితకు వ్యతిరేకంగా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సప్ చాట్స్ సహా పలు ఆధారాలను సమర్పించింది. మద్యం విధాన రూపకల్పన అక్రమాల్లో కవిత సూత్రధారిగా పేర్కొన్న సీబీఐ ఆమె ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ల వాట్సాప్ చాట్స్, కవిత పీఏ అశోక్ కౌశిక్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, దినేష్ అరోరా ఇచ్చిన వాంగ్మూలాలపై కవితను ప్రశ్నించాల్సి ఉందని తెలిపింది.

లిక్కర్ పాలసీని మద్యం వ్యాపారులకు అనుకూలంగా తయారు చేయడం...., అందుకోసం సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులు సేకరించి విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి చేర్చడంలో కవిత కీలక సూత్రధారిగా పనిచేశారని రిమాండ్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. కవిత కోసం బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై, అశోక్ కౌశిక్ పనిచేశారని తెలిపింది. లిక్కర్ వ్యాపారంలో భాగస్వామ్యం కోసం కవితకు మాగుంట రాఘవ, శరత్‌చంద్రారెడ్డి డబ్బు సమకూర్చారని పేర్కొంది. కవిత సహకారంతో దిల్లీ మద్యం వ్యాపారంలో శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి రిటైల్ జోన్స్ పొందారని, ఇందుకోసం కవితకు డబ్బు ఇచ్చారని వివరించింది. మద్యం వ్యాపారంలో భాగస్వామ్యం కోసం తెలంగాణ జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి 80 లక్షలు ఇచ్చారని తెలిపింది. అరబిందో గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ కింద ఈ సొమ్ము ఇచ్చారని వెల్లడించింది. అందుకు ప్రతిఫలంగా శరత్ చంద్రారెడ్డికి ఢిల్లీ మద్యం వ్యాపారంలో అవకాశం కల్పిస్తానని కవిత హామీ ఇచ్చారని తెలిపింది. 2021 జూన్, జూలై నెలల్లో శరత్ చంద్రారెడ్డికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒక ల్యాండ్ డీల్‌లో కవిత చేర్చారని సీబీఐ వెల్లడించింది.

మహబూబ్ నగర్‌లోని ఓ వ్యవసాయ భూమి కోసం సేల్ డీడ్ చేసి 14 కోట్లు..శరత్ చంద్రా రెడ్డి నుంచి కవిత తీసుకున్నారని, అరబిందో గ్రూపునకు చెందిన "మహిరా వెంచర్స్" పేరిట సేల్ డీడ్ జరిగిందని వివరించింది. ఈ కేసులో నిందితుల వాంగ్మూలాలపై కవితను విచారించేందుకు ఐదురోజుల కస్టడీకి అప్పగించాలని... కోర్టును సీబీఐ కోరింది. మరోవైపు కవిత అరెస్ట్, కస్టడీని ఆమె న్యాయవాదులు వ్యతిరేకించారు. ఒక కేసులో అరెస్టై కస్టడీలో ఉన్న వ్యక్తిని మరో కేసులో ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. కవిత అరెస్టుకు రిమాండ్ రిపోర్టు ఆధారమైతే అది పూర్తిగా అన్యాయం, చట్టవిరుద్ధమని వాదించారు. కవిత. ఓ జాతీయ రాజకీయ పార్టీ సభ్యురాలని, కొద్ది రోజుల్లో తెలంగాణాలో ఎన్నికలు జరగనున్నాయని గుర్తుచేశారు. ఈ సమయంలో కవిత అరెస్టు సరికాదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు. కవితను మూడురోజులు... సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. అంతకు ముందు కవితను సీబీఐ ప్రశ్నించడాన్ని, అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.

Tags

Read MoreRead Less
Next Story